శేరిలింగంపల్లి, జూన్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): MNR స్కూల్లో అధిక ఫీజులు, లేట్ ఫీజులు, స్పెషల్ ఫీజులు, ఎక్స్ట్రా కరిక్యులర్ ఫీజుల వసూళ్లు, అలాగే పుస్తకాలు, యూనిఫాంల బలవంతపు అమ్మకాలపై ఫిర్యాదులు చేసిన విద్యార్థి నాయకులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని AIFDS గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి ముత్తన్నగారి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. తల్లిదండ్రుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు AIFDS రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) ఏప్రిల్ 30న శేరిలింగంపల్లి మండల విద్యాశాఖ అధికారికి (MEO) విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

అయితే DEO ఆదేశాలు జారీ అయినప్పటికీ MEO ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీంతో విద్యార్థి నాయకులు, తల్లిదండ్రులు కలిసి పాఠశాలకు వెళ్లి సమస్యల పరిష్కారాన్ని కోరాల్సిన పరిస్థితి ఏర్పడిందని శ్రీకాంత్ ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాంగం తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చేందుకు అక్రమ ఫీజుల దోపిడీని ప్రశ్నించిన విద్యార్థి నాయకులు పల్లె మురళి, NTVS రాష్ట్ర అధ్యక్షుడు పవన్, BRSV నాయకుడు యమలవలస రాజులపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. MNR స్కూల్‌పై MEO వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని, పుస్తకాలు, యూనిఫాంల బలవంతపు అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని, అధిక ఫీజులు, లేట్ ఫీజులు, స్పెషల్ ఫీజులు, ఎక్స్ట్రా కరిక్యులర్ ఫీజుల పేరుతో జరుగుతున్న వసూళ్లను అరికట్టాలని, తల్లిదండ్రుల నుంచి అక్రమంగా వసూలు చేసిన మొత్తాలను తిరిగి చెల్లించాలని, విద్యార్థి నాయకులపై నమోదైన కేసులను వెంటనే రద్దు చేయాలని, DEO ఆదేశాల అమలులో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్య హక్కు కోసం పోరాడటం నేరం కాదని, అక్రమ ఫీజుల దోపిడీని ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేసి ఉద్యమాలను అణచివేయలేరని శ్రీకాంత్ పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం AIFDS పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.





