శేరిలింగంపల్లి, జూన్15 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ వివేకానంద నగర్ కాలనీకి చెందిన యువ స్విమ్మర్ చదల్ల వెంకట మణిధర్ రావు జాతీయ స్థాయి ఫిన్‌స్విమ్మింగ్ పోటీలలో రజత పతకం (సిల్వర్ మెడల్) సాధించి, 2026 సీమాస్ వరల్డ్ ఫిన్ స్విమ్మింగ్ ఇండోర్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన సందర్భంగా పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ, శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన మణిధర్ రావు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతూ రజత పతకం సాధించడం, అనంతరం ప్రపంచ స్థాయి ఛాంపియన్‌షిప్‌కు ఎంపిక కావడం ఎంతో ఆనందదాయకమని, గర్వకారణమని అన్నారు.

ప్రతిష్టాత్మక 2026 సీమాస్ వరల్డ్ ఫిన్ స్విమ్మింగ్ ఇండోర్ ఛాంపియన్‌షిప్ జూన్ 22 నుంచి 29 వరకు దక్షిణ కొరియాలోని ఇంచియన్ నగరంలో జరగనుంది. ఈ టోర్నమెంట్‌కు భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక క్రీడాకారుడిగా మణిధర్ రావు నిలవడం విశేషమని, యువతకు ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. మణిధర్ రావు సాధించిన ఈ ఘనత తెలంగాణ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో మరింత పెంచిందని పేర్కొన్న ఆరెకపూడి గాంధీ, ప్రపంచ వేదికపై భారత్‌కు మరిన్ని విజయాలు అందించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశానికి, రాష్ట్రానికి మరింత కీర్తి తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.





