20 రోజులుగా రోడ్డు పనులు నిలిచిపోవడంతో ఇజ్జత్‌నగర్ వాసుల ఆగ్రహం

శేరిలింగంప‌ల్లి, జూన్‌15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఇజ్జత్‌నగర్ కాలనీలో రోడ్డు నిర్మాణం పేరుతో ఉన్న రహదారిని పూర్తిగా పగలగొట్టి 20 రోజులు గడిచినా ఇప్పటి వరకు కొత్త రోడ్డు వేయకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు టి. రామకృష్ణ విమర్శించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు, కాంట్రాక్టర్లు కాలనీవాసుల ఇబ్బందులను పూర్తిగా విస్మరించారని ఆయన ఆరోపించారు. రోడ్డు తవ్విన తర్వాత పనులను మధ్యలోనే నిలిపివేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దుమ్ము, ధూళి, గుంతలతోపాటు డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ దెబ్బతినడంతో మురుగునీరు రోడ్డుపైకి వచ్చి చేరుతోందని, దీంతో భరించలేని దుర్వాసన, దోమలు, ఈగల సమస్యలు పెరిగాయని పేర్కొన్నారు. బురదతో రాకపోకలు కష్టంగా మారడంతో పిల్లలు, వృద్ధులు, మహిళలు బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితి నెలకొందన్నారు.

రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో దాదాపు 50 కుటుంబాలు తమ ఇళ్లకు సులభంగా చేరుకోలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అధికారులు, మున్సిపల్ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమస్యను పట్టించుకోవడం లేదనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు. వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత దారుణంగా మారి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల పన్నుల డబ్బుతో చేపట్టే అభివృద్ధి పనుల్లో ఇలాంటి నిర్లక్ష్యం సహించరానిదని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని రోడ్డు నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో కాలనీ ప్రజలను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టి, అధికారుల కార్యాలయాల ముట్టడి వరకు ఉద్యమాన్ని విస్తరిస్తామని హెచ్చరించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here