జనార్ధన్ హిల్స్ పార్క్‌ను సుందర వనంగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జూన్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని జనార్ధన్ హిల్స్ కాలనీ పార్క్‌లో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ జనార్ధన్ హిల్స్ కాలనీ పార్క్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి సుందర శోభిత వనంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వేగంగా విస్తరిస్తున్న కాంక్రీట్ నిర్మాణాల మధ్య పార్కులు ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. కాలనీ వాసులు, వృద్ధులు, చిన్నారులు, వాకింగ్‌కు వచ్చే ప్రజలకు పార్క్ ఒక ఆహ్లాదకరమైన విశ్రాంతి కేంద్రంగా ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

పార్కులను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న ఆయన, మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. మానవాళి మనుగడకు మొక్కలు ప్రాణాధారమని, సమస్త జీవకోటికి అవి జీవనాధారమని చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో ఆక్సిజన్ ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించారని, అందుకే ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి వాటిని కాపాడాలని పిలుపునిచ్చారు. అడవుల విస్తీర్ణాన్ని పెంచే లక్ష్యంతో ఖాళీ స్థలాలు, రహదారుల ఇరువైపులా, అనువైన ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఎం. నారాయణరావు, జి. వెంకటరమణ, డి.ఆర్. సుధాకర్, బి. రామకృష్ణరాజు, రత్న, కుముదిని, రష్మీ, రాధిక, కృష్ణారావు, శ్రీలక్ష్మి, యశ్వంత్, అబ్దుల్ కరీం, రాహుల్, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here