శేరిలింగంపల్లి, జూన్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్లో చేపట్టనున్న పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం, ముఖ్యమంత్రి Revanth Reddy బహిరంగ సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కట్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలను సమీకరించి బహిరంగ సభకు తరలించారు. ఈ సందర్భంగా కట్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకులు, డివిజన్ నాయకులు, ఎన్ఎస్యూఐ, సేవాదళ్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






