శేరిలింగంపల్లి, జూన్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ సామాన్య ప్రజలపై కేంద్ర ప్రభుత్వం అధిక భారాలు మోపుతోందని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని MCPI(U) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ డిమాండ్ చేసింది. MCPI(U) కేంద్ర కమిటీ పిలుపు మేరకు గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదంశెట్టి రమేష్ నేతృత్వంలో శేరిలింగంపల్లి మండల తహసిల్దార్‌కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మైదంశెట్టి రమేష్ మాట్లాడుతూ దేశంలో ఒకవైపు నిరుద్యోగం, ఆకలి చావులు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారాలు మోపుతోందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్య ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్య ప్రజల పాలిట శాపంగా మారిందని, ఇది మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఉందని ఆయన అన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు మరింత పేదరికంలోకి నెట్టబడుతున్నారని ఆరోపించిన ఆయన, ప్రజలు చైతన్యవంతులై ప్రజా ఉద్యమాల వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ నాయకులు పల్లె మురళి, అంగడి పుష్ప, శివాని తదితరులు పాల్గొన్నారు.





