శేరిలింగంపల్లి, మే 29 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరువులో ఓ గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యమైంది. శుక్రవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఓ మహిళ దుర్గం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిందన్న సమాచారం పోలీసులకు అందింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, హైడ్రా సిబ్బంది సహాయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో చెరువులో ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. పోలీసుల వివరాల ప్రకారం, మృతురాలి వయస్సు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండొచ్చని అంచనా. ఆమె చామనచాయ రంగుతో, నల్లటి వెంట్రుకలు కలిగి ఉంది. మృతురాలు నలుపు రంగు చుడిదార్, క్రీమ్ రంగు లెగ్గిన్ ధరించి ఉన్నట్లు గుర్తించారు. ఈ మహిళ వివరాలు లేదా ఆచూకీ ఎవరికైనా తెలిసి ఉంటే వెంటనే మాదాపూర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఉన్నవారు మాదాపూర్ పోలీస్ స్టేషన్ సెల్ నంబర్ 8712663109 లేదా ఎస్‌హెచ్‌ఓ డి. కృష్ణమోహన్ సెల్ నంబర్ 8712663100కు సమాచారం అందించాలని కోరారు.






