మంజీరా రోడ్డులో కల్వర్టు పనులు నిలిచిపోవడంతో ప్రజల ఆగ్రహం.. ప్రజావాణిలో మళ్లీ ఫిర్యాదు..

శేరిలింగంపల్లి, మే 25 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మంజీరా రోడ్డులో కల్వర్టు నిర్మాణ పనుల‌ను అసంపూర్తిగా వదిలేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సామాజిక కార్యకర్త మిద్దెల మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగు నెలలుగా ప్రతి ప్రజావాణిలో ఈ సమస్యపై ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ సీఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఈ సమస్యపై సైబరాబాద్ కమిషనర్ సృజ‌న‌కు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు స్పందన కనిపించలేదన్నారు. కల్వర్టు నిర్మాణం పేరుతో రహదారిని తవ్వి వదిలేయడంతో నిత్యం వేలాది మంది ప్రయాణికులు ప్రమాదానికి గురయ్యే పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 99 రోజుల్లో పట్టణాభివృద్ధి చేస్తామని చెబుతుండగా, మంజీరా రోడ్డులో నెలల తరబడి పనులు పూర్తి కాకపోవడం హాస్యాస్పదంగా మారిందని మల్లారెడ్డి విమర్శించారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ శశిరేఖకి మరోసారి ఫిర్యాదు సమర్పించినట్లు తెలిపారు. వెంటనే కల్వర్టు నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు భద్రత కల్పించాలని మిద్దెల మల్లారెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here