శేరిలింగంపల్లి, మే 19 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండలంలోని ఖానామెట్ సర్వే నంబర్ 7లో ఉన్న ఈదులకుంట చెరువును ఆక్రమించి సెల్లార్ తవ్వకాలు చేపడుతున్న భూకబ్జాదారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ కిరణ్మయిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ కూకట్‌పల్లి సర్వే నంబర్ పేరుతో ఖానామెట్ ఈదులకుంట చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న కన్‌స్ట్రక్షన్ యజమానులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మరో నాలుగు రోజులు గడిస్తే చెరువు స్థలంలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

ఎన్‌వీఎస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ చెరువును తమ ఆధీనంలోకి తీసుకుని భారీ జేసీబీలతో సెల్లార్ తవ్వకాలు నిర్వహిస్తోందని ఆరోపించారు. గతంలో హైడ్రా కమిషనర్ స్వయంగా స్థలాన్ని సందర్శించి ఇది ఈదులకుంట చెరువేనని ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం హైడ్రా శాఖ ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదన్నారు. ఖానామెట్ సర్వే నంబర్ 7లోని 6 ఎకరాల 5 గుంటల భూమి ప్రభుత్వ భూమి అని, ఇది ఈదులకుంట చెరువుకు చెందినదేనని రెవెన్యూ అధికారులు రాతపూర్వకంగా వివరాలు ఇచ్చినట్లు తెలిపారు. హైడ్రా ఏర్పాటు అనంతరం కూడా చెరువును కబ్జాల నుంచి రక్షించాలని ప్రజలు పలుమార్లు కమిషనర్ రంగనాథ్‌కు వినతిపత్రాలు సమర్పించినట్లు చెప్పారు. దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ మూడు సార్లు చెరువును సందర్శించి, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి హద్దులు నిర్ణయించాలని ఆదేశించారని గుర్తుచేశారు. చెరువు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించినప్పటికీ, ప్రస్తుతం భారీ యంత్రాలతో తవ్వకాలు కొనసాగుతూ చెరువు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
చెరువులో జరుగుతున్న పనులను వెంటనే నిలిపివేసి, భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని చెరువును పరిరక్షించాలని భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు టి. రామకృష్ణ, సీపీఐ శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి కె. చందు యాదవ్, ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు తుపాకుల రాములు తదితరులు పాల్గొన్నారు.





