క‌ళాశాల‌ల ఆగ‌డాల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి: పల్లె మురళి

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇప్పటికే మార్చి 30 నుండి జూన్ 2వ తేదీ వరకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు సెలవులు ప్రకటించినప్పటికీ ఫిజిక్స్ వాలా, మాడ్యులేస్ కళాశాల తదితర కళాశాలలు దర్జాగా ఐఐటీ-జేఈఈ సమ్మర్ క్లాసుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అదనంగా ఫీజులు వసూలు చేసి సమ్మర్ క్లాసుల‌ను నిర్వహిస్తున్నాయ‌ని, ఆయా కళాశాలల‌పై వెంట‌నే చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (AIFDS) రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ విద్యార్థుల అభ్యర్థనల మేరకు కళాశాలలకు వెళ్లగా విద్యార్థి సంఘాలకు అధికారుల అండదండలతోనే కళాశాలను సమ్మర్‌లో నిర్వహిస్తున్నాం అని యాజమాన్యాలు చెబుతున్నాయని తెలిపారు. ఈ విషయమై రంగారెడ్డి డీఐఈఓ వెంక్య నాయక్ ని కలిసి ఫిజిక్స్ వాలా, మాడ్యులేస్ కళాశాలల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. అక్రమంగా అడ్మిషన్స్ ప్రారంభించి, సమ్మర్ క్లాసులు నిర్వహించడంతో పాటు, ఇప్పటికీ పదవ తరగతి ఫలితాలు వెలువడకముందే బ్రిడ్జ్ కోర్స్ పేరుతో పదవ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులకు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నాయ‌ని, అంతేకాకుండా కళాశాలలో అక్రమంగా పుస్తకాలు అమ్ముతూ తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయని, వెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆయా కళాశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పల్లె మురళి డిమాండ్ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here