శేరిలింగంపల్లి, ఏప్రిల్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికులకు అనేక హామీలను ఇచ్చి, తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కార్మికులను మోసం చేసిందని శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మారబోయిన రవికుమార్ యాదవ్ ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా నర్సంపేటలో ఆత్మబలిదానం చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మియపూర్ ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రవికుమార్ యాదవ్ హాజరై మాట్లాడుతూ గత brs ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం rtc కార్మికులను మోసం చేశాయన్నారు.

గత trs ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి మోసం చేసిందని, ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి సరూర్ నగర్ కార్మికుల సభలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి, మ్యానిఫెస్టోలో పొందుపరచి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆర్టీసిని విలీనం చేయడంలో, కార్మికుల సమస్యలను పరిస్కరించడంలో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణమైన ఫ్రీ బస్ పథకాన్ని ఎంతో క్రమశిక్షణతో, అంకితభావంతో అందేలా పని చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం దారుణమని అన్నారు. గత brs ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు 55 రోజులు సమ్మె చేస్తే ఆనాడు తాము మద్దతు తెలిపి అండగా ఉన్నామన్నారు. ఇప్పుడు కార్మికులు చేసే సమ్మెకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మబలిదానం సంఘటన తనను కలచివేసిందని, ఆ ఘటన చాలా బాధాకరమని అన్నారు. కార్మికులను బలి తీసుకోవడమేనా ప్రజా పాలన అంటే అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
ఏ కార్మికుడూ క్షణకావేశంలో ఆత్మ బలిదానాలకు పాల్పడొద్దని కోరారు. సహనంతో శాంతి యుతంగా పోరాటం సాగించి సమస్యలు పరిష్కరించుకుందామన్నారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆకుల లక్ష్మణ్, గణేష్ ముదిరాజ్, పట్టాభిరామ్, శివ, బాషా, జితేందర్, శ్రీధర్ గౌడ్, రవి గౌడ్, శ్రీనివాస్ చారి, సీతారామరాజు, భరత్ కుమార్ , రాము , మన్యం యాదవ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.





