శేరిలింగంపల్లి, ఏప్రిల్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్, అగ్ర కులానికి చెందిన సోమిరెడ్డి బహుజనధికారి హరి కిరణ్ పై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజు గౌడ్ అన్నారు. ఆదివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ దుర్గయ్య గౌడ్, కన్వీనర్లు అంబాల నారాయణ గౌడ్, బైరు శేఖర్, బీసీ జన సైన్యం అధ్యక్షుడు సింగం నగేష్ గౌడ్ లతో కలిసి బాలరాజ్ గౌడ్ మాట్లాడారు. సోమిరెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు. ఆయన 30 ఏళ్ల సర్వీసులో తన కింది స్థాయిలో ఎంతో మందిని ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. ఇప్పటికీ దానిమీద విచారణ ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. బిసి, ఎస్సీ, ఎస్టీ కులాలకు అండగా నిలుస్తున్నందుకే ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ పై అగ్రకుల అధికారులు కుట్రలకు తెర లేపారని అన్నారు.

నిజాయితీగా పని చేస్తూ ఎక్సైజ్ ఆదాయం పెంచడంలో, గౌడ వర్గం ఎక్స్గ్రేషియా చెల్లింపుల్లో కమిషనర్ గా హరికిరణ్ కృషి మరువలేనిదన్నారు. ఇటీవల ఎక్సైజ్ కానిస్టేబుల్, ఇతర ఉద్యోగుల బదిలీల్లో నిజాయితీగా వ్యవహరించడం అగ్రకులాలకు కంటగింపుగా మారిందని అన్నారు. వారి ఆగడాలు, వారి సిఫారసులను పక్కన పెట్టినందుకే అందరూ ఒక్కటై కమిషనర్ పై ఆరోపణలకు దిగారని అన్నారు. ఉత్తరాదికి చెందిన సోమేశ్ కుమార్, అకున్ సబర్వాల్ లను అడ్డుపెట్టుకొని గీత వృత్తిపై దాడులు జరిపించి, వందలాది కల్లుగీత సొసైటీలను రద్దు చేసి కల్లుగీత కార్మికులను జైలు పాలు చేసిన బీఆర్ఎస్ పార్టీని మరువబోమన్నారు. ప్రస్తుతం వీరే హరికిరణ్ ను ఆంధ్ర వ్యక్తిగా మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించి అసత్య ఆరోపణలు చేస్తున్న సోమిరెడ్డిపై శాఖాపరమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రాకు చెందిన 17 లిక్కర్ తయారీ సంస్థలు, డిస్టరీలరీలు అగ్రకులం వారివి కావా అని ప్రశ్నించారు. వాటి పట్ల తమ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బహుజన ఆఫీసర్లకు అండగా ఉంటామని చెప్పారు. ఇటీవల జరిగిన కానిస్టేబుల్ సాధారణ బదిలీలలో పారదర్శకంగా పైరవీలకు తావులేకుండా ప్రతిభ, సిన్సియారిటీతోపాటు సీనియారిటీ ప్రకారం బదిలీలు చేపడితే హరికిరణ్ పై ఓ పార్టీ నేతలు, ఓ మీడియా సంస్థ కుట్ర చేశారని భావిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రకు చెందిన మేఘా కృష్ణారెడ్డి తెలంగాణలో కాంట్రాక్టులు చేయొచ్చు గానీ, ఆంధ్రకు చెందిన బహుజన బిడ్డ తెలంగాణలో అధికారిగా పనిచేయడం తగదని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. బహుజన అధికారులపై అగ్రకుల రాజకీయ నాయకుల వివక్షను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సంబంధిత శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. శాఖాపరమైన విచారణ ఎందుకు జరపడం లేదో తెలపాలని డిమాండ్ చేశారు.





