శేరిలింగంపల్లి, ఏప్రిల్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో రూ. 40 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించబోయే 100 పడకల క్రిటికల్ కేర్ విభాగం భవనం నిర్మాణం పనులకు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ, సైన్స్, టెక్నాలజీ శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా, DMHO లలిత దేవి, రాజేంద్రనగర్ RDO వెంకట్ రెడ్డి, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు హామీద్ పటేల్, నార్నె శ్రీనివాసరావులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. అనంతరం కొండాపూర్ హాస్పిటల్ డయాగ్నస్టిక్స్ హబ్‌ను వారు సందర్శించారు. వైద్య సేవలు, ల్యాబ్ టెస్టులు తదితర అంశాలపై పేషెంట్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో రూ. 40 కోట్ల 50 లక్షల అంచనావ్యయంతో నూతనంగా నిర్మించబోయే 100 పడకల క్రిటికల్ కేర్ విభాగం నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యవసర వైద్య చికిత్సకు అవసరయ్యే నాణ్యమైన వైద్యం అందించే దిశగా ముందడుగు వేస్తున్నామని, ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో నిర్మించి ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని, నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకూడదని అన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, మాజీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






