శేరిలింగంపల్లి, మార్చి 11 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల వరుసగా సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు బాలురను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 9 సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు అధికారులు వివరాలను వెల్లడించారు. శ్రీవిద్య (11) అనే బాలిక 2 ఏళ్ల కిందట ఓ సైకిల్‌ను కొనుగోలు చేసి ఉపయోగిస్తోంది. ఆమె ఆ సైకిల్‌ను తమ అపార్ట్‌మెంట్‌లోని పార్కింగ్ ప్రదేశంలో పార్క్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 28న సాయంత్రం 6 గంటల సమయంలో ఆమె యథావిధిగా తన సైకిల్‌ను కింద పార్క్ చేసింది. అదే రోజు రాత్రి 10 గంటలకు వచ్చి చూడగా సైకిల్ కనిపించలేదు. దీంతో ఆమె తన తల్లిదండ్రుల సహాయంతో చుట్టు పక్కల సైకిల్ కోసం వెదికారు. అయినా లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇటీవల మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాతృశ్రీనగర్, మియాపూర్‌లలో వరుసగా సైకిళ్ల దొంగతనాలు జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో ఆయా కాలనీల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను వారు పరిశీలించారు. తద్వారా సైకిళ్లను దొంగతనం చేస్తున్న బాలుర ఆచూకీ లభ్యమైంది. వారి వద్దకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా సైకిళ్లను తస్కరిస్తున్నట్లు అంగీకరించారు. దీంతో వారి నుంచి పోలీసులు మొత్తం 9 సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆ బాలురు సులభంగా డబ్బు సంపాదించడంతోపాటు సైకిళ్లపై తిరుగుతూ జల్సాలు చేయాలనే ఉద్దేశంతోనే సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. అపార్ట్‌మెంట్‌లలో సెల్లార్ ఏరియాల్లో రెక్కీ నిర్వహించి తాళం వేయకుండా పార్క్ చేసే సైకిళ్లను వారు దొంగతనం చేస్తున్నట్లు తెలిపారు. వీరిపై మియాపూర్ పోలీస్ స్టేషన్‌తోపాటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కేసులు నమోదైనట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలుర ఆచూకీని కనిపెట్టామని, వారు మియాపూర్ న్యూ కాలనీ వాసులు అని తెలిపారు. కాగా ప్రజలు తమ సైకిళ్లను లేదా వాహనాలను పార్క్ చేస్తే కచ్చితంగా తాళం వేయాలని, అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సీసీటీవీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, అపార్ట్‌మెంట్‌లలో సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.





