శేరిలింగంపల్లి, జూలై 15 (నమస్తే శేరిలింగంపల్లి): దుర్గం చెరువులోకి మురుగునీటి ప్రవాహాన్ని పూర్తిగా అరికట్టేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజన తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. సీఎంసీ, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWS & SB) ఉన్నతాధికారులతో కలిసి దుర్గం చెరువు ఎస్టీపీతోపాటు ఇంటర్సెప్షన్ అండ్ డైవర్షన్ (I&D) వ్యవస్థను పరిశీలించిన కమిషనర్, చెరువులోకి చేరుతున్న మురుగునీటి ప్రవాహాలపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న మురుగునీటి మళ్లింపు ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం, చెరువులోకి మురుగునీరు చేరకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చెరువులోకి మురుగునీటిని తీసుకువస్తున్న వెంట్లను మూసివేయాలని, సోమవారం నాటికి మురుగునీటి ప్రవాహాన్ని ఎస్టీపీకి పూర్తిగా మళ్లించాలని సూచించారు.

ఇంటర్సెప్షన్ అండ్ డైవర్షన్ నిర్మాణం వద్ద సోమవారం నాటికి ఏరేటర్లను ఏర్పాటు చేయాలని రహేజా సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ఎస్ఎన్డీపీ బాక్స్ డ్రెయిన్ పనుల సమయంలో ప్రభావితమైన సీవర్ లైన్ను పునరుద్ధరించాలని, భవిష్యత్తులో మురుగునీరు చెరువులోకి చేరకుండా శాశ్వత మళ్లింపు పైప్లైన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. టీ-హబ్, టీజీఐఐసీ లేఅవుట్ ప్రాంతం నుంచి వస్తున్న మురుగునీటి ప్రవాహాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ అధికారులకు సూచించారు. ఆదేశాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించిన కమిషనర్, సోమవారం మరోసారి దుర్గం చెరువును సందర్శించి పనుల పురోగతి, చేపట్టిన చర్యలను స్వయంగా సమీక్షిస్తానని వెల్లడించారు.





