మహిళ మెడలోని బంగారు గొలుసులు చోరీ.. నిందితుడి అరెస్టు..

శేరిలింగంప‌ల్లి, జూలై 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద మహిళ మెడలోని బంగారు ఆభరణాలను లాక్కెళ్లిన సంఘ‌ట‌న‌కు చెందిన‌ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడు కుక్కల నరేంద్ర (23)ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఐ రమేష్ నాయుడు తెలిపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాచుపల్లి క్రాంతినగర్‌కు చెందిన ఒడ్డిరాజు భారతి (63) తన భర్తతో కలిసి జూలై 9న హనుమకొండలో బంధువుల కార్యక్రమానికి వెళ్లారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆర్టీసీ బస్సులో బయలుదేరి రాత్రి 8.30 గంటలకు మియాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద దిగారు.

ఆ సమయంలో ఆమె భర్త ఓలా ఆటో బుక్ చేస్తుండగా, భారతి బస్‌స్టాప్ సమీపంలోని డివైడర్‌పై నిలబడి ఉంది. సుమారు 15 నిమిషాల తర్వాత ఆటో వచ్చిన సమయంలో, వెనుక నుంచి కాలినడకన వచ్చిన ఓ వ్యక్తి ఆమె మెడలో ఉన్న 33 గ్రాముల మంగళసూత్రం, 35 గ్రాముల చంద్రహారంను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితుడు కుక్కల నరేంద్ర, స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సమీపంలోని కలాపురం బస్తీ వాసిగా గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 25.5 గ్రాముల బంగారు పూసల గొలుసు (చంద్రహారం మోడల్), 14.7 గ్రాముల బరువున్న రెండు మంగళసూత్రాలు (సగం విరిగిన బంగారు గొలుసుతో, రెండు నల్లపూసలు, ఒక ఎర్రపూసతో కూడినవి) స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు ఛేదనలో పాల్గొన్న పోలీసు బృందాన్ని డీఐ రమేష్ నాయుడు అభినందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here