సంగీత మాధుర్యాన్ని అందించిన శరత్ సంగీత్ అన్నమ స్వరార్చన

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానం – అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా శనివారం మధ్యాహ్నం నూట యాభై మందికి పైగా భక్తులకు అన్నదాన ప్రసాదం వితరణ జరిగింది. అనంతరం సాయంత్రం యథావిధిగా పారాయణ కార్యక్రమం నిర్వహించగా, తదుపరి అన్నమ స్వరార్చన భక్తిశ్రద్ధలతో సాగింది. ఈ సందర్భంగా శరత్ సంగీత్ బృందం స్వామి వారికి మధుర స్వరాలతో శ్రీమద్ త్వదీయ, శ్రీమన్నారాయణ, మేలుకో శ్రీంగార రాయ, చక్కని తల్లికి ఛాంగుభళా, ఎక్కడి మానుష జన్మం, తిరుమల గిరి రాయ, రామచంద్రుడితడు, ఒకపరి కొకపరి, నగవులు నిజమని, షోడశ కళానిధికి, చిత్తచోర యశోద (భజన్), నమో నారాయణాయ నమో, జో అచ్యుతానంద, క్షీరాబ్ధి కన్యకకు అనే అన్నమాచార్య సంకీర్తనలను మధుర స్వరాల సమన్వయంతో భక్తితో ఆలపించి విచ్చేసిన భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు.

ఈ స్వరార్చనకు మృదంగంపై తారక్, వయోలిన్‌పై విష్ణు వాయిద్య సహకారం అందించి గానానికి మరింత మాధుర్యం చేకూర్చారు. ఈ సందర్భంగా పద్మశ్రీ డా. శోభారాజు ఒక అన్నమయ్య సంకీర్తనకు భావార్థ వివరణ ఇచ్చి, గాన ప్రదర్శనను అభినందించారు. సాహిత్య భావం, భక్తి, లయ సమన్వయంతో సాగిన స్వరార్చన భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని పంచిందని తెలిపారు. కళాకారులకు అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ సంయుక్తంగా స్వామి వారి జ్ఞాపికను అందించి ప్రశంసించారు.

కార్యక్రమం ముగింపులో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళహారతి సమర్పించి విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణతో ఈ శనివారం అన్నమయ్యపురంలో జరిగిన అన్నదానం – పారాయణం – స్వరార్చన కార్యక్రమం భక్తి, సంగీత మాధుర్యంతో విజయవంతంగా ముగిసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here