శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 28 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పాపిరెడ్డి కాలనీ వాంబే (రెడ్) బిల్డింగ్స్ ప్రాంతంలో పేరుకుపోయిన చెత్త చెదారం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దుర్వాసన, దోమల పెరుగుదలతో పిల్లలు, మహిళలు, వృద్ధులు నిత్యం అనారోగ్యాలకు గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం రోజురోజుకూ పెరుగుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ యువ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు భారీ ర్యాలీగా చేరుకుని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. వాంబే బిల్డింగ్స్ నివాసితులు తమ సమస్యలను నేరుగా వివరించి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ప్రజల ఆవేదనను శ్రద్ధగా విన్న జోనల్ కమిషనర్ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. చెత్త తొలగింపు, ఫాగింగ్ నిర్వహణ, శాశ్వత పరిష్కారం కోసం అవసరమైన చర్యలు ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సుభాష్ రాథోడ్, నవీన్ యాదవ్, రాజశేఖర్ గుప్తా, సంతోష్, గౌతం, నితిన్, యూసుఫ్, మహిళా నాయకురాలు మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.






