అన్నమయ్యపురంలో కన్నుల విందుగా తులసి కూచిపూడి నృత్యం

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వరి 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం యథావిధిగా పారాయణ కార్యక్రమంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంత‌రం నృత్య కూచిపూడి నాట్యాలయం ఆధ్వర్యంలో నాట్య గురువు సునంద గంధం మార్గదర్శకత్వంలో కూచిపూడి నేర్చుకుంటున్న నిడమర్తి తులసి స్వామి వారికి భక్తిపూర్వక కూచిపూడి నృత్యార్చన అర్పించింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మ కడిగిన పాదము, నారాయణతే నమో నమో, అలిమేలు మంగ హరి అంతరంగా, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, ముద్దుగారే యశోద, మాధవునకు మంగళం, క్షీరాబ్ది కన్యకకు అనే అన్నమయ్య సంకీర్తనలకు కూచిపూడి నృత్యరూపంలో భావాభినయాన్ని ప్రదర్శించి కూచిపూడి నృత్యంతో స్వామివారికి నృత్య కైంకర్యాన్ని సమర్పించారు.

అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నంద కుమార్ సంయుక్తంగా తులసికి, గురువు సునందకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జ్ఞాపికను అందించి ప్రశంసించారు. కార్యక్రమం చివరగా శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణతో విజయవంతంగా ముగిసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here