చందానగర్‌లో కుటుంబ కలహం విషాదం: మద్యం మత్తులో ఉరివేసుకుని కూలీ మృతి

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి పరిధిలోని గోపీనగర్‌లో శనివారం తెల్లవారుజామున జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పి. నాగలక్ష్మి అనే మ‌హిళ‌ చందానగర్‌లోని గోపీనగర్, బీసీ హాస్టల్ ఎదురుగా ఉన్న 11-53/1 నంబరు ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమె భర్త గురువయ్య @ ఆనంద్ (37) కూలీగా పనిచేస్తూ కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. పోలీసుల కథనం ప్రకారం, ఫిబ్రవరి 14, 2026 అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో గురువయ్యకు అతని సోదరుడు పొలయ్య @ యేసుతో వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తీవ్రరూపం దాల్చడంతో నాగలక్ష్మి డయల్ 100కు ఫోన్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఇరువురిని విడదీసి, పరిస్థితిని శాంతింపజేశారు. అనంతరం పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అయితే, అదే రోజు తెల్లవారుజామున సుమారు 1 గంట సమయంలో మద్యం మత్తులో ఉన్న గురువయ్య కుటుంబ సభ్యులను భయపెట్టాలనే ఉద్దేశంతో ఉరివేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తలుపులు పగులగొట్టి అతడిని కిందికి దించి, చికిత్స నిమిత్తం కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు అవసరమైన పరీక్షలు, చికిత్సలు నిర్వహించిన అనంతరం గురువయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై భార్య నాగలక్ష్మి ఫిర్యాదు చేయడంతో, పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here