శేరిలింగంపల్లి, జూన్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గోపన్‌పల్లి సర్వే నం.21లో ఉన్న ప్రభుత్వ భూమిలో ఆకృతి కన్స్ట్రక్షన్ సంస్థ నాలాను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతోందని ఆరోపిస్తూ మాజీ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి శేరిలింగంపల్లి ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలను పరిరక్షిస్తామని ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆక్రమణలు నిరంతరం కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించడమే కాకుండా గ్రామ ప్రజలకు అత్యంత అవసరమైన శ్మశానవాటిక ప్రాంతాన్ని, చెరువులకు నీటి ప్రవాహ మార్గంగా ఉపయోగపడే సహజ నాలాను కూడా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడం ఆందోళన కలిగించే విషయమన్నారు. నాలా ఆక్రమణల వల్ల భవిష్యత్తులో భారీ వర్షాల సమయంలో వరద ముప్పు పెరిగే ప్రమాదం ఉందని, దీంతో పరిసర కాలనీలు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.

చెరువులకు నీటి ప్రవాహ మార్గాలు మూసివేతలకు గురైతే పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతోపాటు భూగర్భ జలాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించారు. అధికారులు వెంటనే స్థల పరిశీలన నిర్వహించి ప్రభుత్వ భూమి, నాలా, శ్మశానవాటికపై జరిగిన ఆక్రమణలను తొలగించి అసలు స్థితిని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అమలు చేయాలని కోరారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని, లేనిపక్షంలో గ్రామస్తులు, స్థానిక ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని గంగాధర్ రెడ్డి హెచ్చరించారు.





