శేరిలింగంపల్లి, జనవరి 12 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలను మంగళవారం నుండి ప్రారంభించనున్నారు. గంగిరెద్దులు, హరిదాసులు, బుడబుక్కల, జంగమదేవరులు ,పిట్టలదొర తదితర జానపద కళాకారులు సందర్శకులకు నాలుగు రోజులు అందుబాటులో ఉంటారు. ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం ఆంఫీ థియేటర్ లో ఏర్పాటు చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. 13వ తేదీన కళాకృష్ణ బృందం స్వర నర్తనం, 14న బోగి పండుగ పురస్కరించుకొని పదకొండు సంవత్సరాల లోపు పిల్లలకి బోగి పళ్ళ ఉత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గల వారు పిల్లలను తీసుకొచ్చి బోగి పళ్ళ ఉత్సవంలో పాల్గొనవచ్చని అన్నారు. తాడేపల్లి సుబ్బలక్ష్మి బృందం బోగి , సంక్రాంతి పాటలనులు ఆలపిస్తారని, రేణుక ప్రభాకర్ బృందం గోదా కళ్యాణం నృత్య రూపకం, పాతాళ భైరవి సురభి నాటకం ఉంటాయని అన్నారు. 15వ తేదీన ఆశ్రిత షిండే బృందం గోదా కళ్యాణం, శ్రీ ఒగ్గు ప్రవీణ్ బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన, 16వ తేదీన గౌతమీ బృందం గోదా కళ్యాణం నృత్య రూపకం ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

సోమవారం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆస్ట్రేలియా నుండి విచ్చేసిన భరతనాట్య కళాకారిణి సిమ్రాన్ నాగరాజు నృత్య ప్రదర్శన, బెంగళూరు నుండి విచ్చేసిన విద్వాన్ డాక్టర్ సాగర్ బృందం భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించాయి. పుష్పాంజలి, నారాయణతేయ్ నమో నమో, బ్రహ్మమొక్కటే, శ్రీరామ నీ నామ , వేంకటాచల నిలయే , తిరుప్పావై అంశాలను ప్రదర్శించి మెప్పించారు.





