సానుభూతి చెప్ప‌ని నాయ‌కులు ఎన్నిక‌ల్లో ఎలా పోటీ చేస్తారు ?

  • మేకా రమేష్ చ‌నిపోయాక సంతాప స‌భ పెట్ట‌లేదు
  • తుది శ్వాస విడిచే వ‌ర‌కు ప్ర‌జ‌ల కోస‌మే ప‌నిచేసిన వ్య‌క్తి మేకా ర‌మేష్
  • మేకా ర‌మేష్‌తో క‌లిసి ఎన్నో ప‌నులు చేశా
  • మియాపూర్ డివిజ‌న్ ప్ర‌జ‌లు ఆలోచించి ఓటు వేయాలి
  • ఇండిపెండెంట్ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి

మియాపూర్‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే నాయ‌కుల‌నే ప్ర‌జ‌లు త‌మ పాల‌కులుగా ఎన్నుకోవాల‌ని మియాపూర్ డివిజ‌న్ ఇండిపెండెంట్ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మియాపూర్ డివిజ‌న్ నుంచి తాను ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నాన‌ని తెలిపారు. ప్ర‌జ‌లు విజిల్ గుర్తుకు ఓటు వేసి త‌న‌ను గెలిపించాల‌ని కోరారు.

తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి

తాను గత 19 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి ఉద్యమ నాయకుడిగా, కార్మిక నాయకుడిగా అందరికీ సుపరిచితుడినే అని సంతోష్ రెడ్డి తెలిపారు. 2016 గ్రేటర్ హైదరాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ ఎన్నికలలో మియాపూర్ నుండి పోటీ చేశాన‌ని, కానీ టీఆర్ఎస్ పార్టీ బి-ఫాంను మేక రమేష్ కి ఇవ్వడంతో తాను పోటీ నుండి విరమించుకుని రమేష్ ని డివిజన్ కార్పొరేటర్ గా గెలిపించుకున్నామ‌ని తెలిపారు. అనంత‌రం డివిజ‌న్ ప‌రిధిలోని అన్ని కాలనీలు, బ‌స్తీల్లో ప‌ర్య‌టిస్తూ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మేక ర‌మేష్ వెంట ఉండి త‌న‌ వంతు తోడ్పాటును అందించాన‌ని తెలిపారు.

మేక ర‌మేష్ కార్పొరేట‌ర్‌గా డివిజన్ అభివృద్ధి కోసం జీహెచ్ఎంసీ నుంచి ఎన్నో నిధుల‌ను తీసుకువచ్చి అభివృద్ధి చేశార‌ని, ఆయ‌న‌ ఆఖరి నిమిషం వరకు డివిజన్ ప్రజల కోసం సేవ చేస్తూనే తుది శ్వాస విడిచార‌ని గుర్తు చేశారు. అలాంటి ప్రజా సేవకుడు చనిపోయిన సందర్భంలో డివిజన్ నాయకులుగా ఉండి కూడా కనీసం సంతాప సభ పెట్టి సానుభూతి చెప్పని నాయ‌కులు నేటి ఎన్నికలలో పోటీ చేస్తున్నార‌ని, అలాంటి అభ్యర్థులు రేపు జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో గెలిస్తే ప్రజలకు ఎలా సేవ చేస్తారో ప్రజలు ఆలోచించుకోవచ్చ‌ని అన్నారు.

డివిజన్ లోని త‌న‌ అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు, విద్యావంతులు, మేథావులు, ఉద్యోగులు, కార్మికులు, వ్యాపార వర్గ ప్రజలందరూ ఈసారి వాస్తవ స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే నాయ‌కుల‌నే పాల‌కులుగా ఎన్నుకోవాల‌ని విజ్ఞప్తి చేశారు. కాలనీల వారిగా మేక రమేష్ తో నాలుగున్నర సంవత్సరాల‌పాటు తిరిగాన‌ని, తాను అవగాహనతో డివిజ‌న్‌ను అభివృద్ధి చేస్తాన‌ని తెలిపారు.

మియాపూర్ డివిజన్ లో మొత్తం 30 కాలనీలు ఉన్నాయ‌న్నారు. మయూరి నగర్, లక్ష్మీ నగర్, న్యూ కాలనీ, మియాపూర్ విలేజ్, టేకు నరసింహ నగర్, ఎఫ్‌సీఐ కాలనీ, చిరంజీవి నగర్, ప్రగతి ఎన్‌క్లేవ్, బాలాజీ నగర్, డీకే ఎంక్లేవ్, జేపీఎన్ నగర్, ప్రశాంత్ నగర్, స్టాలిన్ నగర్, ఎంఏ నగర్, కృషి నగర్, జనప్రియ వెస్ట్ సిటీ, కృష్ణ సాయి ఎన్‌క్లేవ్, లక్ష్మీ వెంకట నగర్ కాలనీ, మక్త మహబూబ్ పేట్, రెడ్డి కాలనీ, ప్రజ షెల్టర్, సాయి నగర్ కాలనీ, బీకే ఎన్‌క్లేవ్, సుభాష్ చంద్ర బోస్ నగర్, నడిగడ్డ తండా, డైనమిక్ కాలనీ, దత్త సాయి నగర్ కాలనీ, శ్రీరంగాపూర్ కాలనీలలో ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయో, చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటో త‌న‌కు పూర్తి అవగాహన ఉంద‌ని అన్నారు.

రోడ్లు, పార్కులు, డ్రైనేజీ వ్యవస్థ, పాఠశాలల భవనాలు, కమ్యూనిటీ హాల్స్‌, అంగన్‌వాడీ సెంటర్లు, డివిజన్ లో ఏరియా ఆసుపత్రి కోసం కృషి చేస్తాన‌ని తెలిపారు. అవ‌స‌రం ఉన్న‌వారికి వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు, రేషన్ కార్డులు వ‌చ్చేలా చూస్తాన‌ని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలు ప్ర‌జ‌ల‌కు అందేలా చూస్తాన‌ని అన్నారు. అలాగే ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులకు, ఇతర కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికుల కోసం 24 గంటలు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని తెలిపారు. క‌నుక ప్ర‌జ‌లు త‌మ‌ అమూల్యమైన ఓటును విజిల్ గుర్తుకు వేసి త‌న‌ను గెలిపించాల‌ని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here