శేరిలింగంపల్లి, డిసెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): అనుమానాస్పద స్థితిలో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చందానగర్ లోని రాజేందర్ రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న శంకర్ స్థానికంగా వాచ్ మెన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ప్రశాంత్ (9) అనే కుమారుడు ఉన్నాడు. ప్రశాంత్ స్థానికంగా ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో 4వ తరగతి చదువుతున్నాడు. కాగా మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ప్రశాంత్ తన ఇంట్లోని బాత్‌రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ప్రశాంత్ మృతికి కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.






