శేరిలింగంపల్లి, డిసెంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్, శిల్ప గార్డెన్, వుడ్ ల్యాండ్ ప్రీమియర్ కాలనీలలో పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కాలనీల వాసుల విజ్ఞప్తి మేరకు GHMC ఇంజనీరింగ్ విభాగం, జలమండలి అధికారులు, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ కాలనీలలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర నగర్, శిల్ప గార్డెన్, వుడ్ ల్యాండ్ ప్రీమియర్ కాలనీల వాసులు మాట్లాడుతూ కాలనీలలో నిత్యం డ్రైనేజి పొంగి పొర్లుతుందని , ఔట్ లెట్ సరిగ్గా లేక రోడ్లపై ప్రవహిస్తుందని, డ్రైనేజి సమస్య తీవ్రమైందని, ఔట్ లెట్ సమస్య ను పరిష్కరించి, డ్రైనేజి సమస్యను వెంటనే పరిష్కరించాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్లు వేయాలని, పార్క్ లను అభివృద్ధి చేయాలని, వీధి దీపాలను మెరుగుపరచాలని కోరారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఆయా కాలనీలలో నెలకొన్న డ్రైనేజి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. డ్రైనేజి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. మ్యాన్ హోల్ నుండి మ్యాన్ హోల్ వరకు పూడిక తీసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఔట్ లెట్ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని జలమండలి అధికారులకు సూచించారు. అవసరమున్న చోట మ్యాన్ హోల్స్ పునరుద్ధరించాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన డ్రైనేజి, రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE శిరీష, DE ఆనంద్, జలమండలి మేనేజర్ సందీప్, నాయకులు మారబోయిన రాజు యాదవ్, గణేష్ ముదిరాజు, కొడిచెర్ల రాములు, సత్యం, శశాంక్ పవన్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





