ఘ‌నంగా కాన‌రి ది స్కూల్‌లో దశాబ్ది వేడుక… సాంస్కృతిక కార్యక్రమాలతో అదరగొట్టిన చిన్నారులు…

శేరిలింగంప‌ల్లి, నవంబ‌ర్ 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని కానరి ద స్కూల్ లో Evolve to Excel Change is Constant పేరిట దశాబ్ది వేడుకలను ఘ‌నంగా నిర్వ‌హించారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, విశిష్ట అతిథుల సమక్షంలో ఈ ఉత్సవాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్రమం కానరీ విద్యా ప్రమాణాలకు అద్దం పట్ట‌గా విద్యకు మాత్రమే కాకుండా మానవ విలువలు, సంబంధాలు, భావోద్వేగాలకు కానరీ పాఠశాల ఇస్తున్న ప్రాధాన్యతను స్పష్టంగా ప్రతిబింబించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎదుగుతున్నప్పటికీ, మానవత్వం, కుటుంబ బంధాలు, ప్రేమ, అనుబంధాల వంటి మూలాలను విడ‌వకుండా ముందుకు సాగడమే నిజమైన అభివృద్ధి అనే సందేశాన్ని ఈ వేడుక బలంగా చాటింది. పదేళ్ల ప్రయాణంలో విద్యా ప్రతిభ, సృజనాత్మకత, విలువల విద్యలో కానరీ సాధించిన విజయాలను ఈ సందర్భంగా పాఠశాల సమగ్రంగా సమీక్షిస్తూ ఉత్సవ వాతావరణంలో జరుపుకుంది.

రెండు విడతలుగా సాగిన ఈ వేడుకలు సాంప్రదాయ జ్ఞాన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో శుభారంభం కాగా స్వాగత నృత్యాలు, గీతాగానం, శాండ్ ఆర్ట్, నాటకాలు, థీమ్ ఆధారిత నృత్య ప్రదర్శనలు, శాస్త్రీయ సంగీతం, పలు నాటక ప్రదర్శనలు సాంస్కృతిక వైభవాన్ని చాటాయి. వాటిలో ముఖ్యంగా శివతాండవం, శాస్త్రీయ నృత్యం, పరమానందయ్య శిష్యుల కథ, చౌపట్ రాజా, బాహుబలి నృత్యనాటకం వంటి కార్యక్రమాలు ప్రేక్షకులను ఉత్సాహంతో ఉర్రూతలూగించాయి. దేశభక్తి గీతాలైన నాటు నాటు, ఎత్తర జెండా వంటి ప్రదర్శనలు వేడుకలను ఉన్నత శిఖరానికి చేర్చాయి. ఈ సందర్భంగా కానరి ద స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ రెడ్డి చప్పిడి మాట్లాడుతూ విద్య అనేది కేవలం భవిష్యత్ ఉపాధికి సాధనంగా కాకుండా, జీవన విలువలను పెంపొందించే శక్తిగా మారాల‌ని అన్నారు. ఆయ‌న తండ్రి, గౌతమి, కానరీ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు చప్పిడి రామకృష్ణ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, నాణ్యమైన మౌలిక వసతులు, విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించడమే తన లక్ష్యం అని స్పష్టం చేశారు.

చైర్‌పర్సన్ డా. శ్వేతా రెడ్డి చప్పిడి మాట్లాడుతూ విద్యార్థి కేంద్రిత విద్యను అందివ్వడమే తమ జీవిత లక్ష్యమని, ప్రతి విద్యార్ధిలోని ప్రత్యేకతను గుర్తించి, ఆత్మవిశ్వాసంతో కూడిన నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే నిజమైన విద్య అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డా. చౌహాన్ పిల్లల శ్రేయస్సు, ఆత్మబలం, క్రమశిక్షణ, శారీరక చురుకుదనం వంటి అంశాల ప్రాధాన్యతపై స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. విద్య అనేది కేవలం పాఠ్యాంశాలతో పరిమితమయ్యేది కాదని, భావోద్వేగ దృఢత్వం, శారీరక ఆరోగ్యం, సమతుల్య జీవనశైలితో కూడిన సమగ్ర అభివృద్ధికి పాఠశాలలు దోహదపడాలని అన్నారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఆదిలక్ష్మి చింతలపాటి తన‌ ప్రసంగంలో కానరీ విద్యా తత్వాన్ని మరింత లోతుగా విశదీకరించారు. మార్పు అనేది కేవలం కాలానుగుణంగా జరిగే ప్రక్రియ మాత్రమే కాదు. దానిని అర్థం చేసుకుని, స్వీకరించి, దానికి దిశానిర్దేశం చేయగలిగినప్పుడే విద్యార్థులు నిజమైన నాయకులుగా ఎదుగుతార‌ని అన్నారు.

ప్రిన్సిపల్ లిడియా క్రిస్టినా విద్యలో క్రమశిక్షణను, ప్రేమను జోడించిన వినూత్న విధానాన్ని గురించి ప్రతిపాదించారు. కానరీలో ప్రతి విద్యార్థిని, వ్యక్తిగతంగా గుర్తించి, వారి కోరికలు, బలాలు, అవసరాలను అర్థం చేసుకునే విధంగా బోధన సాగుతుందన్నారు. అధ్యాపక బృంద నిరంతర కృషి, తల్లిదండ్రుల విశ్వాసం, విద్యార్థుల శ్రద్ధే ఈ పదేళ్ల విజయానికి కారణమని తెలిపారు. హెడ్ సీనియర్ స్కూల్ డా. నవీన్ కుమార్ ఇమ్మడి, కో ఆర్డినేటర్లు అపర్ణ వడ్లమూడి, ముక్తా రాతూరి తమ ప్రసంగాలలో కానరీలో అకడమిక్ ప్రమాణాలపై దృష్టిని సారించారు. పదో తరగతి, ఇంటర్, ఐబీ ఫలితాల్లో సాధించిన విజయాలు విద్యార్థుల శ్రమకు ప్రతిఫలమన్నారు. విద్య అనేది కేవలం విజ్ఞానమే కాకుండా నైతిక విలువలు, కరుణ, నాయకత్వ గుణాల సమాహారం అని పేర్కొన్నారు.

పదేళ్ల ప్రయాణాన్ని ప్రతిబింబించే ప్రత్యేక లోగో, డాక్యుమెంటరీ వీడియో ఆవిష్కరణ ఆకట్టుకోగా, స్థాపన కాలం నుంచే పాఠశాలపై నమ్మకం ఉంచిన తల్లిదండ్రుల సత్కారం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కానరి ద స్కూల్ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, ఆనందం, శ్రేయస్సుకు దోహదపడుతున్న విద్యా విధానాలతో కొనసాగుతూ జాతీయ స్థాయి గుర్తింపులు సాధించడం గర్వకారణమని ఎడ్మిన్ మేనేజర్ మహేష్ అక్కం పేర్కొన్నారు. పదేళ్ల విజయవంతమైన ప్రయాణానికి ఈ వేడుకలు మైలురాయి వంటిదని, అంతేకాకుండా భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేయడానికి ఆరంభమనని ప్రస్పుటం చేశాయి. ఆనందోత్సాహాల మధ్య జరిగిన వేడుకలలో ఉపాధ్యాయులు, ఎడ్మిన్ సిబ్బంది తదితరులు ప్రధాన భూమికను పోషించి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here