శేరిలింగంపల్లి, నవంబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): వందేళ్ల సంఘ ( RSS ) యాత్రలో భాగంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో కలిసి జన జాగరణ కార్యక్రమంలో బిజెపి నాయకుడు, జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్త ప్రపంచాన్ని తన కుటుంబంగా భావించే ఆలోచన హిందుత్వ ఆలోచన అని, కుటుంబ సభ్యులు అందరూ కనీసం వారానికి ఒకరోజు కలిసి భోజనం చేయాలని అన్నారు. కుటుంబంలో యజ్ఞం, సంస్కారం, వ్రతం, పండుగల ద్వారా ఇంటి వాతావరణం సామాజిక సాంస్కృతిక, ఉత్సవభరితంగా ఉండాలి. మన కుటుంబంలో భజన్ కార్యక్రమాలలో మన మిత్ర కుటుంబాల రాకపోకలు ఉండాలి. మన కుటుంబ చరిత్ర, సంప్రదాయం, చేయవలసిన సామాజిక పనుల గురించి ఇంట్లో చిన్నా పెద్ద అందరితో చర్చ జరగాలి. మన ఇల్లు ఆదర్శ హిందూ గృహంగా మారాలనే పట్టుదల ఉండాలి. అనవసర ఖర్చులు, వరకట్నం వంటి దురాచారాలను నివారించాలి. మన ఇంట్లో మహిళలకు గౌరవం ఉండాలని అన్నారు. ఇవన్నీ మన కుటుంబాన్ని, మన మిత్రుల కుటుంబాలను ఆనందమయంగా ఉంచుతుంది. ఎవరికివారు ఇటువంటి జీవనాన్ని ఆచరించి ప్రోత్సహించడం నేటి అవసరం. అదే సమాజ పరివర్తన అవుతుందని అన్నారు. సమాజపరివర్తనా కార్యం ధర్మస్థాపన వంటిదే. దీనిని చేయడానికి మనం సంకల్పం తీసుకోవాలి. పంచ పరివర్తన ద్వారా సమాజ పరివర్తన అనే ఈ కార్యం రాష్ట్ర ధర్మం. మన జాతి ధర్మం. ఇదే యుగ ధర్మం అని అన్నారు.






