శేరిలింగంపల్లి, జూన్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): బోనాల ఉత్సవాల నిర్వహణకు సంబంధించి సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించిన సమన్వయ సమావేశంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్, ఎంపీ ఎం. అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మర్రి రాజశేఖర్ రెడ్డి, నవీన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ దయానంద్‌తోపాటు సీనియర్ ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో గజాల ఊరేగింపు, బోనాల ఉత్సవాల నిర్వహణ, భక్తుల రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్య చర్యలు, తాగునీటి సరఫరా, ప్రజా సౌకర్యాలు, అత్యవసర సేవల ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

ప్రతి శాఖ చేపట్టాల్సిన బాధ్యతలు, ముందస్తు ఏర్పాట్లు, శాఖల మధ్య సమన్వయంపై ప్రత్యేకంగా చర్చించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా పరిశుభ్రమైన వాతావరణం, సమర్థవంతమైన పౌర సేవలు, భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ఏర్పాట్లు కల్పించేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని శాఖలతో సమన్వయంగా పనిచేస్తుందని కమిషనర్ తెలిపారు.






