శేరిలింగంపల్లి, అక్టోబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): పాలస్తీనా సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 7న వి.ఎస్.టి నుండి ఇందిరా పార్క్ వరకు నిర్వహించనున్న సంఘీభావ ర్యాలీ ని విజయవంతం చేయాలని కోరుతూ మియాపూర్ ముజఫర్ అహమ్మద్ నగర్ యం సి పి ఐ (యు ) పార్టీ కార్యాలయంలో పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు తుడుం అనిల్ కుమార్, కొంగరి కృష్ణ, కర్ర దానయ్య మాట్లాడుతూ ఇజ్రాయిల్, గాజాపై మలి దశ విధ్వంశానికి పూనుకొన్నది. హత్యగావించబడిన 65,000 మందిలో మహిళలు, పిల్లలు, వృద్ధులే యాభై శాతానికి ఎక్కువగా ఉన్నారని అన్నారు. వీధులన్నీ శ్మశానాలుగా మారిపోయాయని, ఇళ్ళు, భవనాలు, మోడులుగా నిలిచిపోయాయన్నారు. పనిలేదు. ఆహారం లేదు, మంచినీటి సౌకర్యం లేదు. ఆహారం కోసం, మంచినీటి కోసం కొండకెదురు చూసినట్లు చూడాల్సి వస్తున్నది. మోడు వారిన గోడలను వదిలి పెట్టకుండా మిగిలిన ప్రజల ఇజ్రాయిల్ మారణకాండను ఆపడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు పాలస్తీనాకు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. 145 దేశాలు పాలస్తీనానూ స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ తీర్మానించాయి. అమెరికాలో కూడా గాజాపై హింసకు నిరసన తెలుపుతున్నారు. అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించిన విద్యార్థులను బంధించి, ఆయా దేశాలకు తిరిగి పంపిస్తున్నారు. యూనివర్సిటీలపై కక్ష గట్టి నిధులు నిలుపుదల చేశారన్నారు. దీనికి వ్యతిరేకంగా స్పందించాలి. మానవ సమాజం మాట్లాడాలి. అందుకనే అక్టోబర్ 7న హైదరాబాద్ నగరంలో వామపక్షాలు, ఇతర పక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యలో భారీ స్థాయిలో పాలస్తీనా ప్రజలకు సంఘీభావాన్ని ప్రకటించాలని నిర్ణయించాయన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఇందిరా పార్క్ వరకు ప్రదర్శనను నిర్వహించ తలపెట్టాయని, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. వామపక్ష నాయకులు ఇస్లావత్ దశరథ్ నాయక్, శివాని, యం డి సుల్తాన బేగం, డి నర్సింహా, యం డి రజియా బేగం, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.






