- సమ్మర్ క్యాంపుకు వచ్చిన విద్యార్థిలో స్పార్క్ గమనించిన కోచ్…
- PJR స్టేడియంలో మొదలుపెట్టి… LCA లో మెలకువలు నేర్పి…
- శిష్యుడు కోసం తన కెరియర్ నే మార్చుకున్న గురువు…
- అవమానాలు, ఆటుపోట్లను ఎదుర్కొని ప్రపంచ స్థాయికి ఎదిగి…
- తిలక్ వర్మ జీవితంలో చెరగని ముద్ర సలాం బయాష్…
నమస్తే శేరిలింగంపల్లి (వినయకుమార్ పుట్ట): ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ప్రత్యర్థి జట్టు పాకిస్తాన్ పై భారత్ గెలుపు ఇక అసాధ్యమే అని అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్న వేళ క్రీజ్ లోకి అడుగుపెట్టిన తిలక్ వర్మ ఆ దశనే మార్చేసాడు. యావత్ భారతావణి ఆశలకు జీవం పోసి జట్టును గెలుపు తీరానికి చేర్చాడు. ఇంత ఒత్తిడి లోను ఓర్పుతో చాకచక్యంగ ఆడగలిగిన తిలక్ చతురత వెనుక అసలు రహస్యమేమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రాథమిక విద్యా దశ నుంచే తల్లితండ్రుల ప్రోత్సాహం…
బీహెచ్ఈఎల్ లో ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్న నంబూరి నాగరాజు, గాయత్రి దంపతులు శేరిలింగంపల్లి భెల్ ఎంఐజీలో స్థిరపడ్డారు.వారి కుమారుడు ఐన తిలక్ వర్మ ప్రాథమిక విద్యా దశ నుంచే క్రికెట్ పట్ల ఆసక్తిని కనబరిచేవాడు. దీంతో ఆ తల్లిదండ్రులు తిలక్ ను ఆ దిశగా ప్రోత్సహిస్తూ స్పెషల్ కోచింగ్ లకు పంపేవారు. ఈ క్రమంలోనే చందానగర్ పీజేఆర్ స్టేడియంలో ఒక ఏడాది వేసవి శిక్షణ శిబిరానికి పంపించారు. అక్కడ కోచ్ గా వ్యవహరిస్తున్న హైదరాబాద్ పాతబస్తీ బార్కాస్ కి చెందిన సలాం బయాష్ తిలక్ వర్మ లోని స్పార్క్ ని గుర్తించాడు. తిలక్ మెలకువలు నేర్చుకుంటే మంచి ఆటగాడిగా రాణించగలుగుతాడని విశ్వసించి అతడిది చేరదీశాడు.

తిలక్ ఆసక్తి, సామర్థ్యాన్ని గమనించిన కోచ్ సలాం…
క్రికెట్ పట్ల తిలక్ వర్మ కున్న ఆసక్తితో పాటు అతడి శక్తి సామర్థ్యాలను గమనించాడు సలాం. ఎన్ని గంటలు మైదానంలో ఉన్న అలసట కనిపించని తిలక్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాడు కోచ్. తాను చెప్పిన సూచనలు సలహాలను ఆకలింపు చేసుకున్న తిలక్ వర్మ ఆటలో రాణించేవాడు. ఈ క్రమంలో గురు శిష్యుల బంధం బాగా బలపడింది. సలాం అప్పటికే పెద్ద సంఖ్యలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నప్పటికీ ఎక్కువ సమయం తిలక్ వర్మకే కేటాయించేవాడు. తిలక్ తో పాటు శిక్షణ పొందుతున్న తోటి విద్యార్థుల తల్లిదండ్రులు అది జీర్ణించుకునేవారు కాదు. రోజురోజుకు తిలక్ వర్మ శిక్షణపైనే కోచ్ సలాం ప్రత్యేక దృష్టి పెట్టడాన్ని సహించలేని ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు(కొందరు) వారిద్దరి మధ్య అగాధం ఏర్పరచాలని నిర్ణయించుకున్నారు.

గురు శిష్యులను విడదీయాలన్న కక్షతో…
కోచ్ సలాం నుండి తిలక్ ను దూరం చేస్తేనే తమ పిల్లలకు తగిన శిక్షణ దక్కుంతుందని భావించిన పలువురు తల్లిదండ్రులు 2016 మే నెలలో చందానగర్ పోలీస్ స్టేషన్ లో కోచ్ సలాం పై ఫిర్యాదు చేశారు. గత మూడు నెలలుగా తన వద్ద శిక్షణ తీసుకుంటున్న కొందరు విద్యార్థులపై పలు ఆకృత్యాలకు పాల్పడుతున్న సలాంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో సలాం దిగివచ్చి తాము ఆశించినట్టు చేస్తాడనుకున్నారు. ఐతే వారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు సలాం. ఎంతోకాలంగా పిజెఆర్ స్టేడియం లో క్రికెట్ సేవలు అందిస్తున్న సలాం కోచ్ బాధ్యతల నుండి తప్పుకున్నాడు.

మానసికంగా కృంగి మంచం పట్టి...
తనపై లేనిపోని అబాండాలు వేసి నిరాధార ఆరోపణలు చేసిన పలువురు తల్లిదండ్రుల వైఖరితో సలాం మానసికంగా కృంగిపోయాడు. దీంతో ఆరోగ్యం కూడా దెబ్బతిని కొన్ని నెలల పాటు శిక్షణకు దూరంగా ఉన్నాడు. సలాం కొంతకాలానికి కోలుకొని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలోని లేగల స్పోర్ట్స్ అకాడమీలో క్రికెట్ కోచ్ గా తన కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. తిలక్ వర్మను తన వెంట తీసుకొని రెట్టింపు చొరవతో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. తనకోసం తన కెరీయర్ నే వదులుకున్న గురువు సలాం సంకల్పాన్ని తనలో నింపుకున్న తిలక్ వర్మ అనేక మెలకువలు నేర్చుకొని తొలుత రంజి ఆ తర్వాత ఐపీఎల్ ఆ తర్వాత అండర్ 19, క్రమంగా టీమిండియా చివరకు కౌంటిలలో సైతం ఆడేంత ధీటుగా తయారయ్యాడు. ఈ క్రమంలోనే ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ అదీ పాకిస్తాన్ తో తలపడుతూ పరిస్థితులు పూర్తి ప్రతికూలంగా మారుతున్నప్పటికీ తన కోచ్ చెప్పిన సూచనలు సలహాలతో ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా చివరి వరకు క్రీజ్ లో నిలబడి భారతమాత నుదుటన కస్తూరి తిలకం దిద్దాడు.

అప్పుడైనా ఇప్పుడైనా కోచ్ అంటే భయం భక్తి…
కోచ్ సలాం అంటే తిలక్ వర్మకు ఎనలేని గౌరవం, భయం, భక్తి. ఏ రంగంలో అయినా రాణిస్తున్న వారు సమాజంలో సెలబ్రెటీలుగా చెలామణి అవుతారు. ఈ క్రమంలో చిన్న చిన్న పొరపాట్లు చేసి కెరియర్ ని దెబ్బ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ తిలక్ వర్మ ఆ పరిస్థితి తెచ్చుకోలేడు అందుకు కారణం సలాం. ప్రపంచంలో ఏ దేశంలో ఆటకు వెళ్లినా రాత్రికి సకాలంలో వారు బస చేసే చోటుకి వెళ్లేలా, అక్కడి సమయానికి అనుకూలంగా విధిగా ప్రాక్టీస్ చేసేలా నేటికీ కోచ్ సలాం ఒత్తిడి చేస్తూనే ఉంటాడు. ఎంత ఎదిగిన సలాం విషయంలో ఒదిగి ఉంటూ అటు గురువు విలువను ఇటు తన కెరియర్ ను కాపాడుకుంటున్నాడు తిలక్ వర్మ.







