- భీమని విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 29(నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ప్రకృతిని ఆరాధించే అతిపెద్ద పండుగ బతుకమ్మ అని భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సురభి కాలనీలో బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భీమని విజయలక్ష్మి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ.. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని గుర్తుచేసే వినూత్నమైన పండుగ బతుకమ్మ అని అన్నారు. మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం మొదలైన అంశాలన్నింటినీ పాట రూపంలో ఆలపించే అద్భుత ఘట్టం బతుకమ్మ సొంతమని అన్నారు.

ఈ పండుగ ఎలా మొదలైందో చెప్పడానికి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ బతుకమ్మ అంటే తెలంగాణ అస్తిత్వం అనడంలో మాత్రం అతిశయోక్తి లేదని అన్నారు. అనంతరం బతుకమ్మ వేడుకలో పాల్గొన్న మహిళలకు నిర్వాహకురాలు భీమని విజయలక్ష్మి పసుపు కుంకుమలతో పాటు చీరలను వాయినంగా అందజేశారు. తన ఆహ్వానాన్ని మన్నించి పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహిళలకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చ నాయకురాళ్లు రాధ మూర్తి, పద్మ, రేణుక, గాయత్రి, మహేశ్వరి, కాంచన కృష్ణ, వినీత సింగ్, స్నిగ్ధ తో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





