- చందానగర్ సర్కిల్ వినాయక నిమజ్జన ఏర్పాట్లలో వింత వైనం
- ఇంజనీరింగ్ విభాగం నిర్లక్షం – కాంట్రాక్టర్లకు వరం
-వినయకుమార్ పుట్ట (నమస్తే శేరిలింగంపల్లి): రాజుల సొమ్ము – రాళ్ల పాలు అనేది ఒకప్పటి నానుడి… ప్రస్థుతం బల్దియాలో కొనసాగుతున్నది ప్రజల సొమ్ము – కాంట్రాక్టర్ల పాలు… అనే వైఖరి. వినాయక నిమజ్జన కాంట్రాక్ట్ వర్కుల్లో ఈ వైనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ లో ఇంజనీరింగ్ అధికారుల సహకారంతో కాంట్రాక్టర్లు అదనంగా లబ్ధిపొందుతున్న అంశాలను పరిశీలిద్దాం…

6 చెరువుల వద్ద రూ.47 లక్షలతో…
వినాయక నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో చందానగర్ సర్కిల్ పరిధిలోని 6 చెరువుల వద్ధ వివిధ సేవల కోసం జీహెచ్ఎంసి కాంట్రాక్టర్లకు అవకాశం ఇచ్చింది. మొత్తం రూ.47.30 లక్షలతో ప్రతిపాధనలు సిద్ధం చేయగా.. పలువురు కాంట్రాక్టర్లు ఈ పనులను దక్కించుకున్నారు. ఆయా చెరువుల వద్ద ఉన్న ప్రత్యేక కోనేరులను పండగకు ముందే శుభ్రం చేసి. వాటిలో నీళ్లు నింపి నిమజ్జనం అయ్యే వినాయక ప్రతిమలను, వ్యర్ధాలను ఏరోజుకు ఆరోజు తొలగించడం. నిమజ్జనాలు పూర్తయ్యాక కోనేరులను శుభ్రం చేసి తదుపరి ఉత్సవాలకు అనుగుణంగ అందించడం వారి భాద్యత. ఆ కోనేరుల వద్దకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూసుకోవడం ఆ పనుల ముఖ్య ఉద్దేశం.

బల్దియా మోటార్లే బరిలోకి…
ఈ కాంట్రాక్టు పనుల్లో ప్రతీ ఏడు జరుగుతున్న తంతు ఏందంటే… కోనేరులను శుభ్రం చేసి సిద్ధం చేయడానికి కాంట్రాక్టర్ డబ్బులు పొందుతున్నప్పటికీ ఆ పనులలో మాత్రం జీహెచ్ఎంసీ సిబ్బంది సహకారం తీసుకుంటున్నారు. బల్దియా లో వాటర్ వర్క్స్ విభాగానికి సంబంధించిన సిబ్బంది ఈ సేవల్లో భాగస్వామ్యం అవ్వడం విడ్డూరం. అంతే కాదు ఆ విభాగానికి చెందిన మోటార్లను ఉపయోగించే కోనేరుల్లోని నీటిని తొలగిస్తున్నారు. ఇలాంటి మోటార్లను బయటనుండి తీసుకు వస్తే పెద్దమొత్తంలో ఖర్చవుతుంది. నిమజ్జనానికి ముందు అదేవిధంగా నిమజ్జనం పూర్తయ్యాక రెండు సార్లు కోనేరుల వద్ద ఇలాగే లబ్ధి పొందుతున్నారు కాంట్రాక్టర్లు.

శుభ్రమైన జలాలే లక్షంగా…
ఇక కోనేరుల్లో నింపే నీటి విషయానికి వస్తే.. జిహెచ్ఎంసి పరిధిలోని చెరువులన్నీ కలుషితమయ్యాయి. ఈ క్రమంలో భక్తులు ఎంతో పవిత్రంగా నవరాత్రులు పూజించే గణనాథ ప్రతిమలను గౌరవప్రదంగా నిమజ్జనం చేయాలని సదుద్దేశంతో కోనేరుల్లో శుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచాలన్నది బల్దియా ఉద్దేశం. ఈ క్రమంలోనే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ట్యాంకర్ల ద్వారా కోనేరుల్లో నీటిని నింపాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా కాంట్రాక్టర్లు కోనేరుల పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ బోర్ల నుండి పూర్తిస్థాయిలో నీటిని ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయంలో చాలా చోట్ల జీహెచ్ఎంసీ నుంచి భారీగా సహకారం పొందుతున్నారు కాంట్రాక్టర్లు.

ప్రభుత్వ బోరు – నిరంతరాయంగా…
ఉదాహారణకు మియాపూర్ గుర్నాథ్ చెరువు వద్ద దాదాపు రూ.11 లక్షలకు ఈ పనులకు టెండర్లను పిలువగా 22.89% తగ్గింపుతో రూ.7.87 లక్షలకు ఎల్.సురెందర్ అనే కాంట్రాక్టర్ పనులను దక్కించుకున్నాడు. ఐతే అక్కడి కోనేరులో నీటిని నింపాల్సిన భాద్యత ఆయనది. అందుకు ట్యాంకర్లను ఉపయోగించాలి. కాని ఆ చెరువు పక్కనే ఉన్న జీహెచ్ఎంసికి సంబంధించిన బోరును ఉపయోగిస్తున్నాడు. శేరిలింగంపల్లి మున్సిపాలిటిగా 2003లో నాటి కమిషనర్ పేరిట మంజూరైన కరెంట్ మీటర్ అనుసందానంతో ఉన్న బోర్ ఇది. ప్రస్థుతం ఆ బోరు జలమండలి ఆధీనంలో ఉన్నదని బిల్లులు మాత్రం జీహెచ్ఎంసీ చెల్లిస్తున్నట్టు సమాచారం. సర్వీస్ నెంబర్ 360404068 గల కరెంట్ మీటర్ తో కొనసాగుతున్న ఈ బోర్ పండుగకు కొన్ని రోజుల ముందు కోనేరును శుభ్రం చేసిన నాటి నుంచి నేటి వరకు నిరంతరాయంగా నడుస్తూనే ఉంది. గత నేల ఈ కరెంట్ మీటర్ బిల్ రూ.10,384 వచ్చింది. ఈ నెల రూ. లక్షల్లో వచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ విషయంలో జలమండలి & జీహెచ్ఎంసీకి చెందిన స్థానిక కిందిస్థాయి సిబ్బంది కాంట్రాక్టర్ తో కుమ్మకైనట్టు సమాచారం.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం…
జిహెచ్ఎంసి పరిధిలోని మిగిలిన సర్కిల్లలోనూ చాలాచోట్ల ఇలాంటి వ్యవహారమే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇలా జిహెచ్ఎంసిని అడ్డుపెట్టుకొని రెట్టింపు లాభాలు పొందుతున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చందానగర్ సర్కిల్ పరిధిలోని కాంట్రాక్టర్ల వ్యవహారం పై ఉప కమీషనర్ శశిరేఖ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇందిరా బాయి లను ‘నమస్తే శేరీలింగంపల్లి’ వివరణ కోరగా అసలు విషయం తెలుసుకోని చర్యలు తీసుకుంటామని అన్నారు.





