- సూపర్ స్ట్రక్చర్ పన్ను వసూళ్లలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం
- 2024 ఏప్రిల్ 1 నుండి నేటి వరకు రూ.56 లక్షలు హాం ఫట్
- 2021 నుండి 2024 ఆర్ధిక సంవత్సరం వరకు కొనసాగుతున్న పరిశీలన
- ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్ల రూపాయలు ప్రశ్నార్ధకం
-వినయకుమార్ పుట్ట (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సర్కిల్ లో ప్రజలు కట్టిన ఆస్తి పన్నును ఒక సాధారణ కంప్యూటర్ ఆపరేటర్ దారి మరల్చింది. కొంత మొత్తాన్ని ఖజానాలో తిరిగి జమ చేసినప్పటికి.. అసలు కాజేసిన మొత్తం సొమ్మెంత.. ఆ మొత్తం ఏం చేసింది అనేది తెలియాల్సి ఉంది. వివరాళ్లొకి వెళితే…
సిటిజెన్ సర్విస్ సెంటర్ కేంద్రంగా…
జిహెచ్ఎంసిలో చందానగర్ సర్కిల్ 21 ఏర్పడిన నాటి నుంచి సుభాషిణి అనే మహిళ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తుంది. 2016 నుంచి ఆమె సర్కిల్ కార్యాలయంలోని సిటిజన్ సర్వీస్ సెంటర్ లో విధులు నిర్వహిస్తోంది. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్, ట్యాక్స్ అస్సెస్మెంట్ లాంటి చెల్లింపులను స్వీకరించి ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు అందజేయడం ఆమె చేయాల్సిన పని. విధి నిర్వహణలో ప్రతి రోజు వేల రూపాయలు వసూళ్లు చేసే ఆమె ఆ మొత్తం తన సొంతం అవుతే బాగుండు అనుకుందో ఏమో..? 2024-25 ఆర్థిక సంవత్సరం మొదలు నేటి వరకు రూ.56 లక్షలు పన్నుల రూపంలో వసూలు చేసింది. నిర్మాణదారులకు రశీదులు ఇచ్చింది కాని వారి నుండి సేకరించిన మొత్తాన్ని మాత్రం ప్రభుత్వ ఖజానాలో జమచేయలేదు. ఐతే 2021 నుండి 2024 ఆర్ధిక సంవత్సరం వరకు ఎంత మొత్తం వసూలయ్యిందో..? ప్రభుత్వ ఖజానాలో ఎంత జమచేసిందో తెలియాల్సి ఉంది.

జిహెచ్ఎంసిలో నగదు చెల్లింపులే లేవు… ఇంత నగదు ఎలా..?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ గా లోకేష్ కుమార్ కొనసాగుతున్న సమయంలో 2024 ఆర్థిక సంవత్సరం నుండి నగదు చెల్లింపులను రద్దు చేశారు. చెక్కు, డెబిట్ కార్డు, యూపీఐల ద్వారా మాత్రమే ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ ఇతరాత్ర చెల్లింపులు స్వీకరించాలని ఆదేశాలు జారీచేసారు. దీంతో అప్పటి నుండి ఇప్పటి వరకు ఆన్ లైన్ చెల్లింపులు మాత్రమే కొనసాగుతున్నాయి. ఐతే సూపర్ స్ట్రక్చర్లకు సంబంధించిన పన్ను మొత్తాలకు మాత్రం నగదు రూపంలో కూడ చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఈ క్రమంలోనే కేవలం చందానగర్ సర్కిల్ లోనే ఏడాదికి కోటి రూపాయల వరకు నగదు రూపంలో వచ్చి చేరుతుందని సమాచారం.
సూపర్ స్ట్రక్చర్… సూపర్ సోర్స్ గా మారి…
జిహెచ్ఎంసి పరిధిలో కోర్టు వివాద స్థలాలు చాల ఉంటాయి. వాటిల్లో నిర్మాణాలకు అనుమతులుండవు. అయినప్పటికీ చాలా స్థలాల్లో ప్రజలు నివాసాలు ఏర్పరచుకొని దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్నారు. వాటితో పాటు అనుమతలు ఉన్న భవనాలను నిబంధనలకు విరుద్ధంగా నిర్మింస్తుంటారు. వీటినే బల్దియాలో సూపర్ స్ట్రక్చర్లుగా పరిగణిస్తారు. అలాంటి నిర్మాణాలకు ప్రత్యేక పన్ను విధానంతో 2016 జీవో నెంబర్ 299 ని తెరపైకి తీసుకువచ్చింది నాటి ప్రభుత్వం. ఈ జీవో ప్రకారం అనుమతులు ఉండి జారీ చేసిన నిర్మాణ అనుమతుల కంటే 10% వరకు డీవియేషన్ ఉంటే 25%, పది కంటే ఎక్కువ శాతం మార్పులతో కడితే 50%, అసలు అనుమతే లేకుండా నిర్మాణం చేపడితే 100% రెట్టింపుతో ఆస్థిపన్ను వసూలు చేస్తారు. ఈ సూపర్ స్ట్రక్చర్ ల నుండి సేకరించే పన్ను నగదు రూపంలో వసూలు చేసే అవకాశం ఉండటం సదరు ఆపరేటర్ కు ఆయుధంగా మారింది.

అధికారాన్నే అవకాశంగా మలచుకుని…
జిహెచ్ఎంసి లోని 30 సర్కిల్లలో సిటిజెన్ సర్విస్ సెంటర్ లు ఉన్నాయి. అక్కడి కంప్యూటర్ ఆపరేటర్లకు 2021 లో ప్రత్యేకంగా లాగిన్, పాస్ వర్డ్ లు కేటాయించారు. ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్, సెల్ఫ్ అసెస్మెంట్లకు సంబంధించిన ఆన్ లైన్ చెల్లింపులతో పాటు సూపర్ స్ట్రక్చర్ లకు సంబంధించిన నగదు చెల్లింపులను స్వీకరించే భాద్యతను వీళ్లకే అప్పగించారు. ఐతే ఇక్కడ బల్ధియ నిర్వహణం లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అంతకు ముందు వరకు ఆస్తిపన్ను, ట్రెడ్ లైసెన్స్ ఇతర వసూళ్లు పై అధికారి సూపర్ విజన్ లో జరిగేవి. కిందిస్థాయి సిబ్బంది వసూలు చేసిన మొత్తాన్ని ఖజానాలో జమ చేయకపోతే పై అధికారికి అదే రోజు తెలిసిపోయేది. కాని కొత్తగా ఆపరేటర్లకు ఇచ్చిన ప్రత్యేక లాగిన్ లో మాత్రం పై అధికారి నియంత్రణే లేదు. ఆపరేటర్ చెప్పిందే వినాలి. కట్టిన దాన్నే నమ్మాలి. చందానగర్ సర్కిల్ ఆపరేటర్ సుభాషిణి ఈ అవకాశాన్నే క్యాచ్ చేసింది. ఆన్ లైన్ చెల్లింపులకు సంబంధించిన మొత్తాలను ప్రభుత్వ ఖజానాలో చెల్లించింది. కానీ సూపర్ స్ట్రక్చర్లకు సంబంధించిన నగదు మొత్తాలను మాత్రం గల్లంతు చేసింది.
అసలు విషయం బయటపడిందిలా..
జీహెచ్ఎంసి / స్టేట్ ఆడిటర్లు అప్పుడప్పుడు సర్కిల్ కార్యాలయాలకు విచ్చేసి తనిఖీలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఆగస్ట్ లో చందానగర్ సర్కిల్ కు వచ్చారు. ఐతే సిటిజెన్ సర్వీస్ సెంటర్ ఆపరేటర్ సుభాషిణి మాత్రం వారి నుంచి తప్పించుకుని తిరుగుతుంది. వారికి కావలసిన సమాచారం ఇవ్వకుండా ఏవో సాకులు చెప్పింది. గత సోమవారం నుండి అసలు ఆఫిస్ వైపుకే రాలేదు. అనుమానం వచ్చిన ఆడిటర్లు సర్కిల్ ఉన్నతాధికారుల సహకారంతో ఆమెను రప్పించి లాగిన్, పాస్ వర్డ్ తీసుకుని సిస్టమ్ ను పరిశీలించారు. ఈ క్రమంలో 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు 36 లక్షలు. 2025 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు దాదాపు 21 లక్షలు సూపర్ స్ట్రక్చర్ ల ద్వార నగదు వచ్చినట్టు గుర్తించారు. ఐతే ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాలో మాత్రం జమచేయకపోవడాన్ని గుర్తించారు.

సుభాషిణి పాత్రదారా..? సూత్రదారులు వేరే ఉన్నారా..?
ఆడిటర్లు విషయం గుర్తించగానే ఆపరేటర్ సుభాషిణి వెంటనే తాను చేసిన తప్పును ఒప్పేసుకుంది. అంతటితో ఆగకుండా ఒక్కరోజులోనే తాను కాజేసిన రూ.56 లక్షలను తీసుకువచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హూడకాలనీ శేరిలింగంపల్లి శాఖలో ఆగస్ట్ 26 మంగళవారం ప్రభుత్వ ఖజానాలో జమ చేసింది. ప్రస్థుత ఆన్ లైన్ యుగంలో వేల రూపాయల నగదు చేతికి దొరకడమే కష్టంగా ఉన్న తరుణంలో ఒక మహిళ ఉద్యోగి రాత్రికి రాత్రి రూ.56 లక్షలు నగదు రూపంలో సేకరించడం అనేక అనుమానాలకు తావిస్తుంది. తాను పాల్పాడిన కుంభకోణం ఆమె స్వతహాగా చేసిందా..? లేక ఎవరైన వెనకుండి ఈమెతో చేయించారా అనేది తెలిియాల్సి ఉంది.
కొనసాగుతున్న ఆడిటర్ల పరిశీలన…
ప్రజలు చెల్లించే పన్నుల్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వాటా ఉంటుంది. ఈ క్రమంలోనే బల్దియాతో పాటు స్టేట్, సెంట్రల్ ఆడిటర్లు ఈ ఆదాయ వ్యవహారాలను పరిశీలిస్తుంటారు. ఐతే 2024-25 ఆర్ధిక సంవత్సరం పూర్తయ్యి 5 నెలలు గడుస్తున్న తరుణంలో రూ.56 లక్షలు గల్లంతయినట్టు గుర్తించారు. ఈ మొత్తం కేవలం చందానగర్ సర్కిల్ లోని సూపర్ స్ట్రక్చర్ లకు సంబంధించిన నగదు మాత్రమే. 2024 కంటే ముందే ఇతర రెవెన్యూ చెల్లింపులు సైతం నగదు రూపంలోనే చెల్లించారు ప్రజలు. 2021-22 ఆర్ధిక సంవత్సరం నుండి గతేడాది వరకు సైతం పెద్ద మొత్తంలో నగదు తస్కరణకు గురైనట్టు అనుమానలు వ్యక్తమవుతున్నాయి. ఆడిటర్లు అప్పటి నుండి అన్ని చెల్లింపులను పరిశీలిస్తున్నారని సమాచారం. ఆపరేటర్ పన్ను చెల్లింపుదారులకు అధికారికంగా రశీదులు ఇచ్చింది. ఆ వివరాలను స్టేట్మెంట్ల రూపంలో తన సిస్టమ్ లోను పొందు పరిచింది. కాని నగదు మాత్రం ప్రభుత్వ ఖజానాలో వేయలేదు. మరి ఇంత వ్యవహారం నడుస్తుంటే బల్దియ, స్టేట్, సెంట్రల్ ఆడిటర్లు ఏం చేస్తున్నట్టు..? సూపర్ స్ట్రక్చర్స్ పేమెంట్స్ స్టేట్మెంట్ లో నమోదైన మొత్తాన్ని, ప్రభుత్వ ఖజానాలో జమచేసిన మొత్తాన్ని సరిచూసుకోవాల్సిన కనీస భాద్యతను విస్మరించడం సైతం అనుమానాలకు తావిస్తుంది.

బల్దియా 30 సర్కిళ్ల కతేందీ..?
జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 30 సర్కిళ్లు ఉన్నాయి. అందులో చందానగర్ సర్కిల్ లోనే 858 సూపర్ స్ట్రక్చర్లను అధికారికంగా గుర్తించారు. ఒకవేళ పైన పేర్కొన్న సూపర్ స్ట్రక్చర్లు అన్నిటి నుంచి విధిగా ట్యాక్స్ వసూలు చేస్తే ఆ ఆదాయమే ఏడాదికి కోట్లల్లో ఉంటుంది. ఈ లెక్కన గత నాలుగేళ్లలో చందానగర్ సర్కిల్ లో ఎన్ని కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. అందులోంచి ఖాజానాలో జమ అయ్యింది ఎంత తెలియాల్సి ఉంది. ఐతే చందానగర్ సర్కిల్ మాదిరిగా మిగిలిన సర్కిల్లలోని ఆపరేటర్లు ఎవరైన చేతివాటం ప్రదర్శించారా..? అదేవిధంగా ఈ కుంభకోణం ఆపరేటర్ పనేనా..? లేక వెనకాల ఇంక ఎవరైనా ఉన్నారా అనే అంశంపై కూడ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తప్పు ఒప్పుకుంటే సరిపోతుందా..? చర్యలేవి..?
ఆపరేటర్ సుభాషిణి తాను చేసిన మోసాన్ని ఒప్పుకొని రూపాయలు 56 లక్షల నగదును బ్యాంకులో జమ చేసింది. కాని 2021 నుండి 2024 వరకు ఎంత మొత్తం గళ్లంతయ్యిందో తెలియాల్సి ఉంది. ఐనప్పటికి ఆమెపై ఎలాంటి చర్యలకు పాల్పడలేరు ఉన్నతాధికారులు. ఇంత పెద్ద వ్యవహారం జరిగినా భాద్యులపై క్రిమినల్ కేసులు పెట్టకపోవడం విడ్డూరం. ఈ వ్యవహారం బయటికి పొక్కితే తమ పేర్లు సైతం బయటికి వస్తాయని పై అధికారులు జంకుతున్నారా..? ప్రస్థుత ఏడాది కాజేసిన మొత్తం ఎలాగో కట్టించాం కద అంతకు ముందు సంవత్సరాలది కదిలించడం ఎందుకని బావిస్తున్నారో మరి. ఇదే విషయమై చందానగర్ సర్కిల్ ఉప కమిషనర్ శశిరేఖని నమస్తే శేరిలింగంపల్లి సంప్రదించగా ఆడిటింగ్ ఇంకా కొనసాగుతున్నదని, వారిచ్చే రిపోర్టును బట్టి తదుపరి సమాచరం ఇస్తామని తెలిపారు.





