రెండు వేర్వేరు రోడ్డు ప్ర‌మాదాల్లో ఇద్ద‌రు వ్య‌క్తులు మృతి

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రెండు వేర్వేరు సంఘ‌ట‌న‌ల్లో ఇద్ద‌రు వ్య‌క్తులు మృతి చెందారు. చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌ల‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. గోప‌న్‌ప‌ల్లికి చెందిన ఎం.త‌రుణ్ (25) ర్యాపిడో డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తూ ఆర్‌సీ పురం సాయిన‌గ‌ర్ కాల‌నీ, రోడ్ నం.4లో నివాసం ఉంటున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆగ‌స్టు 20వ తేదీన ఉద‌యం 5 గంట‌ల స‌మ‌యంలో త‌రుణ్ త‌న డియో స్కూటీ (TS07E1991)పై ప్ర‌యాణిస్తూ న‌ల్ల‌గండ్ల ఫ్లై ఓవ‌ర్ వ‌ద్ద రోడ్డు ప‌క్క‌న పార్క్ చేసి ఉంచిన చెత్త ఆటో రిక్షా (TS34TA4426)ను వేగంగా వ‌చ్చి ఢీకొట్టాడు. దీంతో అత‌ని త‌ల‌కు తీవ్ర గాయాలు కాగా అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు.

మ‌రో సంఘ‌ట‌న‌లో..

ఒడిశాలోని జాజాపూర్ జిల్లా చంద‌న్‌పూర్‌కు చెందిన రాకేష్ జెనా (39) ఈసీఐఎల్ మ‌ల్లాపూర్ అశోక్ న‌గర్‌లో నివాసం ఉంటూ స్థానికంగా ప్లంబ‌ర్‌గా ప‌నిచేస్తూ జీవ‌నం సాగిస్తున్నాడు. ఆగస్టు 16వ తేదీన రాత్రి 8.30 గంట‌ల స‌మ‌యంలో త‌న ప‌ల్స‌ర్ ద్విచ‌క్ర వాహ‌నం (TG08AB3970)పై ప్ర‌యాణిస్తుండ‌గా చందాన‌గ‌ర్ పీజేఆర్ ఎన్‌క్లేవ్ రోడ్డు అప‌ర్ణ కన్‌స్ట్ర‌క్ష‌న్ బిల్డింగ్ వద్ద ర‌హ‌దారి ప‌క్క‌నే ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్‌పై నుంచి ప్ర‌మాద‌వ‌శాత్తూ త‌న వాహనాన్ని న‌డిపించాడు. వాహ‌నం వేగంగా వెళ్ల‌డంతో ఒక్క‌సారిగా స్కిడ్ అయి కింద ప‌డిపోయాడు. దీంతో అత‌ని త‌ల‌, ఎడ‌మ చేతికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ క్ర‌మంలో అత‌న్ని చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిట‌ల్‌కు త‌రలించారు. కాగా అత‌ను హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ ఆగ‌స్టు 20వ తేదీన ఉద‌యం 5.41 గంట‌ల‌కు మృతి చెందాడు. ఈ క్ర‌మంలో రెండు సంఘ‌ట‌న‌ల్లోనూ పోలీసులు మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి త‌ర‌లించి కేసుల‌ను న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here