శేరిలింగంపల్లి, ఆగస్టు 20 (నమస్తే శేరిలింగంపల్లి): ఆగస్టు 24వ తేదీన కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొనే శేరిలింగంపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు కోరారు. ఆల్విన్ కాలనీ ఎక్స్ రోడ్ మియాపూర్ అతిధి బ్యాంకేట్ హాల్ లో శేరిలింగంపల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్పొరేటర్లు మాధవరం రోజా దేవి రంగారావు, జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు సాయిబాబా, రంగారావు మాట్లాడుతూ ఆగస్టు 24 ఆదివారం ఉదయం 10 గంటలకి శేరిలింగంపల్లి నియోజకవర్గం కార్యకర్తల ఆత్మీయ సమావేశం మియాపూర్ నరేన్ గార్డెన్స్ లో జరగనుందన్నారు. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారని, డివిజన్లో ఉన్న ప్రతి కార్యకర్తకి తెలియజేసి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తల త్యాగం, కష్టం, అంకితభావమే పార్టీకి బలమని తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళన సభ ద్వారా ప్రతి కార్యకర్తకు పార్టీ భవిష్యత్తు దిశపై స్పష్టత లభించనుందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పార్టీ బలోపేతం దిశగా కలసి ముందుకు సాగేందుకు ఇది ఒక వేదిక కానుంది అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగస్ట్ 24వ తేదీన ఆదివారం జరిగే ఆత్మీయ సమ్మేళన సభలో తప్పక పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.





