శేరిలింగంపల్లి, ఆగస్టు 20 (నమస్తే శేరిలింగంపల్లి): రామంతపూర్ యాదవ సంఘం విద్యుదాఘాతం ఘటన ద్వారా చనిపోయిన కుటుంబ సభ్యులకు వెంటనే పరిహారం చెల్లించాలని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆగస్టు 17వ తేదీన రాత్రి రామంతపూర్ యాదవ సంఘం ఆధ్వర్యంలో జరిగిన శ్రీ కృష్ణాష్టమి శోభాయాత్ర వేడుకల్లో విద్యుత్ షాక్ తో ఆరుగురు మృతి చెందారని, వారిలో పింజర్ల కృష్ణ యాదవ్, చిట్టబోయిన సురేష్ యాదవ్ మరణించారని, హాస్పటల్లో చికిత్స పొందుతున్న వారికి కూడా ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని అన్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, వారి వలన ఇంత మంది ప్రాణాలు పోయాయని, అందుకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

అఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు మద్దతుగా బంధుమిత్రులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డుపై ఆందోళనకు దిగి రాస్తారోకో నిర్వహించారు. ప్రతి ఒక్క బాధిత కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం, కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు విద్యుత్ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఇలాంటి అవాంచనీయ సంఘటనలు జరగడం దురదృష్టకరమని చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరణించిన వారికి న్యాయం జరగకపోతే వారికి న్యాయం జరిగేదాకా పోరాడుతామని తెలియజేశారు.





