శేరిలింగంపల్లి, ఆగస్టు 17 (నమస్తే శేరిలింగంపల్లి): మద్యం మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు ఇద్దరు టీనేజ్ యువకులపై దాడి చేసిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం మైలారం గ్రామానికి చెందిన రాథోడ్ యుగందర్ (17), కె.ఆదిత్య (14) ఆగస్టు 16వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో చందానగర్‌లోని పీజేఆర్ స్టేడియంలో అథ్లెటిక్స్ శిక్షణ కోసం రన్నింగ్ చేస్తున్నారు. రన్నింగ్ ముగిసిన తరువాత స్టేడియం బయటకు రాగా వారిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అకారణంగా దాడికి యత్నించారు. మొత్తం 8 మంది వ్యక్తులు వారి ఇద్దరిపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆదిత్య దంతాలు విరిగి రక్త స్రావం అవడంతోపాటు అతని వెండి చెయిన్ కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో యుగంధర్, ఆదిత్యలను స్థానికులు చికిత్స నిమిత్తం హాస్పిటల్‌లో చేర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు వారి ఫిర్యాదు మేరకు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. సదరు 8 మంది వ్యక్తుల్లో ఒకతని పేరు కార్తీక్ అని చెప్పినట్లు బాధితులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.





