శేరిలింగంపల్లి, ఆగస్టు 13 (నమస్తే శేరిలింగంపల్లి): మూసి ఉన్న ఆలయం ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తి ఆలయ హుండీలలో ఉన్న నగదును చోరీ చేసిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంపల్లిలోని గోపన్పల్లి తండాలో ఉన్న శ్రీశ్రీశ్రీ మేరమ్మ అమ్మవారు, శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో నేనావత్ రాజ్ కుమార్ అనే వ్యక్తి అర్చకుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆగస్టు 12వ తేదీన రాత్రి 9.30 గంటల సమయంలో యథావిధిగా ఆలయాన్ని మూసి తాళం వేసి రాజ్ కుమార్ ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం తెల్ల వారుజామున 5 గంటలకు వచ్చి చూడగా ఆలయ ప్రధాన ద్వారం తలుపులు బద్దలు కొట్టి ఉన్నాయి. ఆలయంలో ఉన్న 2 హుండీల్లోని నగదు మాయమైనట్లు గుర్తించాడు. దీంతో అతను పోలీసులకు సమాచారం అందించగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆలయంలోని 2 హుండీల్లో సుమారుగా రూ.80వేల నగదు ఉంటుందని, గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించి హుండీల్లో ఉన్న నగదును చోరీ చేశాడని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిర్దారణ అయిందని, నిందితున్ని వెతికి పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.





