శేరిలింగంపల్లి, జూన్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నల్లగండ్ల గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జగదీశ్వర్ గౌడ్ తనయుడు వైభవ్ కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ జీవిత ప్రయాణం, ప్రజాసేవను ప్రతిబింబించే ప్రత్యేక పాటను సామ రామ్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంచితనాన్ని పంచుతూ, మానవత్వాన్ని మతంగా భావిస్తూ, సమాజ హితాన్నే జీవిత లక్ష్యంగా ఎంచుకుని ముందుకు సాగుతున్న జగదీశ్వర్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజల పట్ల చిత్తశుద్ధితో పనిచేసే నాయకులు అరుదుగా ఉంటారని, అలాంటి నాయకత్వ లక్షణాలు జగదీశ్వర్ గౌడ్‌లో స్పష్టంగా కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. అబద్ధాలు, ఆడంబరాలకు దూరంగా ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తున్న నాయకుడిగా ఆయనను కొనియాడారు. ధర్మం, నిజాయితీ వైపు నిలబడి ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న జగదీశ్వర్ గౌడ్‌కు రోజురోజుకూ ప్రజాభిమానం మరింత పెరుగుతుందని సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన ముఖంలో ఎల్లప్పుడూ ఆప్యాయత, మమకారం కనిపిస్తాయని, పలకరింపులో కల్మషం లేని వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడమే జీవిత సార్థకతగా భావిస్తూ, సమాజానికి మేలు చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్న నాయకుడు జగదీశ్వర్ గౌడ్ అని అన్నారు. ప్రజలకు మంచి చేస్తే అదే మంచి అనేక రెట్లు తిరిగి వస్తుందనే నమ్మకంతో ఆయన ముందుకు సాగుతున్నారని చెప్పారు.

అనేక మందికి ఆదర్శంగా నిలుస్తూ, తనవంతు సేవలను సమాజానికి అందిస్తున్న జగదీశ్వర్ గౌడ్‌కు భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని సామ రామ్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. కార్యక్రమానికి హాజరై తమకు ప్రోత్సాహం అందించిన సామ రామ్మోహన్ రెడ్డికి వైభవ్ కృష్ణ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





