శేరిలింగంపల్లి, ఆగస్టు 13 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమై, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి అండగా నిలవాలని భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు వర్ష బాధితులకు అండగా నిలవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారని, ఆయన స్ఫూర్తితో సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ శ్రేణులను కోరారు. శేరిలింగంపల్లిలోని హైటెక్ సిటి, చందానగర్, మాదాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాలతో పాటు కొండాపూర్, మదీనా గూడ, హఫీజ్ పేట్ లల్లో గులాబీ శ్రేణులు సహాయ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఇప్పటికే అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా లేకపోయినా, ప్రతిపక్షంగా మన బాధ్యత ఎక్కువని, ప్రజలకు అండగా నిలిచేలా ముందుకు రావాలని కోరారు.

బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి తాగునీరు, పాలు, ఆహారం, మందులు, బట్టలు వంటి కనీస అవసరమైన సహాయాన్ని అందించాలన్నారు. అత్యవసర వైద్య అవసరాల కోసం కూడా అవసరమైనచోట మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సహాయక చర్యల్లో స్థానిక ప్రభుత్వ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ హయాంలోనే హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందిందన్నారు. దాన్ని కొనసాగించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలం అయ్యిందన్నారు. వరద నీరు సరిగా వెళ్లేలా చూడాల్సిన బాధ్యతను మరిచి రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతున్నారని మండిపడ్డారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అండగా నిలుద్దామని రవీందర్ యాదవ్ సూచించారు. తమ తమ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల్లో కేటీఆర్ స్ఫూర్తితో పాల్గొనాలని పిలుపునిచ్చారు.





