శేరిలింగంపల్లి, ఆగస్టు 4 (నమస్తే శేరిలింగంపల్లి): ఇళ్లు, ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని మియాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతని నుంచి బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులతోపాటు ఓ ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్‌లోని మైత్రినగర్‌లో నివాసం ఉంటున్న మైలగాని రవి స్థానికంగా ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా అతను ఇంట్లో లేని సమయంలో తన ఇంట్లో ఉన్న ఇంటి పత్రాలు, ఓ యమహా ఫసినో బైక్ చోరీకి గురయ్యాయి. ఈ క్రమంలో అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు. అతను మియాపూర్ ఎంఏ నగర్లో నివాసం ఉండే మేడిశెట్టి గణపతిరావు (40) అని, స్థానికంగా అతను కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతను దీప్తిశ్రీనగర్‌లో ఉన్న దత్త నారాయణ పీఠంలోనూ చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు అతన్ని అరెస్టు చేసి అతని నుంచి యమహా ఫసినో బైక్‌తోపాటు ఇంటి పత్రాలు, బంగారు మంగళ సూత్రం, అమ్మవారి వెండి, బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకుని అతన్ని రిమాండ్‌కు తరలించారు.






