శేరిలింగంపల్లి, ఆగస్టు 4 (నమస్తే శేరిలింగంపల్లి): మానసిక ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్న ఓ గృహిణి తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన కాటం గోవింద రెడ్డి కుమార్తె దండ శోభ (36)ను 14 ఏళ్ల కిందట అమరేందర్ రెడ్డి అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. వీరు చందానగర్‌లోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి వర్షిత్ రెడ్డి, పల్లవి అనే కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా గత కొంత కాలంగా శోభ మానసిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలోనే ఆమె ఆగస్టు 1వ తేదీన రాత్రి 10.30 గంటల సమయంలో ఇంట్లో ఉన్న కలుపు నివారిణి మందును తాగింది. అనంతరం వాంతులు చేసుకుంది. అది గమనించిన భర్త అమరేందర్ రెడ్డి ఆమెను చికిత్స నిమిత్తం వెంటనే స్థానికంగా ఉన్న పీఆర్కే హాస్పిటల్‌కు తరలించాడు. ఈ క్రమంలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శోభ ఆగస్టు 4వ తేదీన ఉదయం 5.45 గంటల సమయంలో మృతి చెందింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు శోభ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.





