శేరిలింగంపల్లి, జూలై 9 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ నిధి కింద తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీని బార్ కౌన్సిల్ చైర్మన్ అధ్యక్షుడిగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్, తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ నిధి ఎక్స్ అఫిషియో చైర్మన్ ఎల్.నరసింహారెడ్డి తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ నిధిని తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ నిర్వహిస్తుందని తెలిపారు. వివిధ విభాగాల కింద దాఖలు చేయబడిన క్లెయిమ్ లేదా పదవీ విరమణ ప్రయోజనం, వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం, జూనియర్ న్యాయవాదులకు లైబ్రరీ లోన్ దరఖాస్తులను కమిటీ పరిష్కరిస్తుందని తెలిపారు. సంక్షేమ నిధికి ప్రధాన ఆదాయ వనరు రూ.250 విలువైన సంక్షేమ నిధి స్టాంపుల కోసం న్యాయవాదులు చేసే చెల్లింపులు, ప్రతి వకాల్, మెమొ ఆఫ్ అప్పియరెన్స్‌పై న్యాయవాదులు ఈ స్టాంపులను అతికించాలని అన్నారు. ఈ విధంగా అందిన నిధులను న్యాయవాదుల సంక్షేమ నిధి, న్యాయవాదుల గుమాస్తాల సంక్షేమ నిధి మధ్య 86:14 నిష్పత్తిలో విభజించబడతాయన్నారు.

2011-2017లో డెత్ క్లెయిమ్‌ను రూ.3లక్షలు చెల్లించడం జరిగిందని, కాలక్రేమేణా దాన్ని రూ.4 లక్షలకు పెంచామని, ప్రస్తుతం రూ.6 లక్షలుగా ఉందని అన్నారు. సభ్యుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు డెత్ క్లెయిమ్‌ను రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలకు, అంత్యక్రియల ఖర్చులను రూ.15వేల నుంచి రూ.20వేలకు పెంచినట్లు వివరించారు. వైద్య ఖర్చుల కోసం అయ్యే ఆర్థిక సహాయాన్ని గరిష్టంగా రూ.1 లక్షకు పెంచినట్లు తెలిపారు. జూనియర్ న్యాయవాదులకు లైబ్రరీ లోన్‌ను రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంచామని అన్నారు. ఈ మార్పులు అక్టోబర్ 6 నుంచి అమలులోకి వస్తాయన్నారు.





