హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): వాసన్ హెల్త్ కేర్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ అరుణ్ (51) ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించినట్లు చెన్నైలోని కావేరి ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు, ఆయన పార్థివ దేహాన్ని వైద్య పరీక్షల అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. డాక్టర్ అరుణ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వాసన్ ఐ కేర్ ఆస్పత్రులని ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందించార. ప్రస్తుతం డాక్టర్ అరుణ్ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో నిర్వహించబడుతున్న 20కి పైగా ఉన్న వాసన్ ఐ కేర్ నెట్వర్క్ హాస్పిటళ్లకు చైర్మన్ అండ్ ఎండీగా కొనసాగుతున్నారు. డాక్టర్ అరుణ్ ఆకస్మిక మరణం తెలిసిన వెంటనే రెండు రాష్ట్రాల్లో ఉన్న వాసన్ ఐ కేర్ ఆస్పత్రులను మూసివేసి డాక్టర్ అరుణ్ ఆకస్మిక మరణం పట్ల సిబ్బంది సంతాపం తెలిపారు. డాక్టర్ అరుణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్బంగా ఏజీఎం అనిల్ మాట్లాడుతూ డాక్టర్ అరుణ్ ఆకస్మిక మరణం పట్ల రానున్న పది రోజులు సంతాప దినాలుగా పాటించాలని రెండు రాష్ట్రాల్లోని వాసన్ ఐ కేర్ సిబ్బందిని కోరారు. ఈ కార్యక్రమంలో వాసన్ ఐ కేర్ హాస్పిటల్స్ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.