శేరిలింగంపల్లి, డిసెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): పనిచేస్తున్న భవనం 3వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కింద పడిన ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మాదాపూర్ సిద్దిక్‌నగర్ రోడ నంబర్ 11 వద్ద ఫ్లాట్ నంబర్లు 1066, 1067 వద్ద గత కొంత కాలంగా భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆ పనుల్లో దుర్జాన్ మఖన్ (32) అనే వ్యక్తి గత కొంత కాలంగా మేస్త్రిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం పనికి వచ్చి 3వ ఫ్లోర్‌లో పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ జారి కింద పడ్డాడు. దీంతో అతని తలకు తీవ్రగాయాలు కాగా అతన్ని చికిత్స నిమిత్తం కొండాపూర్‌లోని కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. దుర్జాన్ ను పరిశీలించిన వైద్యులు అతను అప్పటికే చనిపోయాడని తెలిపారు. ఈ మేరకు అతని భార్య అస్మిత సృజన్ సన్వాని ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.