శేరిలింగంపల్లి, నవంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) లో భాగంగా చందానగర్ సర్కిల్ లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో చందానగర్ లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఇంటింటి సర్వే కార్యక్రమానికి కేటాయించబడిన ఎన్యుమరేటర్ లు, సూపర్వైజర్ లు క్షేత్ర స్థాయిలో వివరాలు నమోదు చేస్తూ ఈ నెల 19వ తేదీ వరకు 14 రోజుల్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ను పూర్తి చేయాలని, ప్రజలందరూ ఈ సర్వేకు సహకరించాలని కోరారు.
డిప్యూటీ కమీషనర్ పి. మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. సూపర్ వైజర్లు, ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన కుటుంబాలను గుర్తించి ఇంటి నంబరు వివరాల నమోదు ప్రక్రియను నాలుగు వార్డ్ లలో ప్రతి ఇంటికి స్టిక్కర్ ను అతికిస్తున్నారని, ప్రతి వార్డ్ కి ఒక ఇంచార్జి, వార్డ్ లలో ప్రతి సూపెర్వైజర్ కింద 10 మంది ఎన్యుమరేటర్లతో ఈ సర్వే మొదలైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారిణి ఉషా రాణి, సూపర్ వైజర్లు, ఎన్యుమరేటర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.