శేరిలింగంపల్లి, అక్టోబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): ఓ హత్య కేసులో నిందితున్ని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈవిధంగా ఉన్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మసీదుబండ సుదర్శన్ నగర్ వద్ద ఉన్న ఆల్ ఎంవోయూ కాలనీ హెచ్ఐసీ గ్రీవ్ అవెన్యూ అపార్ట్‌మెంట్స్ ప్లాట్ నం.403లో నివసిస్తున్న మందల మనోజ్ కుమార్ (29) స్థానికంగా ప్రైవేటు జాబ్ చేసి జీవనం సాగిస్తున్నాడు. కాగా మియాపూర్‌లోని దీప్తిశ్రీనగర్ పరిధలోని సీబీఆర్ ఎస్టేట్స్ బ్లాక్ 3ఎ, ఫ్లాట్ నం.110లో నివాసం ఉంటున్న బండి స్పందన (29) 2017 నుంచి మనోజ్ కుమార్‌కు స్నేహితురాలు. అయితే స్పందన తన క్లాస్‌మేట్, ఫ్రెండ్ అయిన వారణాసి వినయ్ కుమార్ అనే వ్యక్తిని 2022లో వివాహం చేసుకుంది. తరువాత ఇద్దరి మధ్య అనుకోని మనస్ఫర్థలు రావడంతో గత కొంత కాలంగా ఈ దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు.
దీంతో మనోజ్ కుమార్ కన్ను స్పందన మీద పడింది. తనను ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడ సాగాడు. అయితే స్పందన మాత్రం అతని ప్రేమను నిరాకరిస్తూ వచ్చింది. ఒక స్నేహితుడిలా మాత్రమే చూస్తున్నానని మనోజ్‌కు చెప్పింది. దీంతో విసుగు చెందిన మనోజ్ తీవ్ర ఆగ్రహానికి లోనై ఆమెను ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 30వ తేదీన ఇంట్లో స్పందన ఒంటరిగా ఉందన్న విషయం తెలుసుకున్న మనోజ్ ఆమెపై గ్రానైట్ స్టోన్‌తో దాడి చేశాడు. ఆమె తలపై స్టోన్‌తో మోదడంతోపాటు వెంట తెచ్చుకున్న స్రూ డ్రైవర్‌తో ఆమె ముఖంపై పొడిచి దారుణంగా హత్య చేశాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన స్పందన అక్కడికక్కడే మృతి చెందింది. కాగా పోలీసుల విచారణలో మనోజ్ కుమార్ నేరం అంగీకరించడంతో అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన మియాపూర్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ వి.దుర్గా రామలింగ ప్రసాద్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, నరసింహారెడ్డిలను మియాపూర్ డివిజన్ ఏసీపీ పి.నరసింహా రావు ప్రశంసించారు.