- నగరంలో 137 లింక్ రోడ్ల నిర్మాణం చేపడుతాం
- రూ.313 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులు
- లింక్ రోడ్ల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ వెల్లడి
హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ నగరంలో ప్రజలకు ట్రాఫిక్ బాధలను తగ్గించేందుకుల లింక్ రోడ్లు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం నగరంలో పలు చోట్ల నూతనంగా నిర్మించిన లింక్ రోడ్లను ఆయన ప్రారంభించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.45 నుంచి పాత ముంబై జాతీయ రహదారి వరకు రూ.15.54 కోట్ల వ్యయంతో నిర్మించిన లింక్ రోడ్డును లెదర్ పార్క్, నందిహిల్స్ వద్ద ప్రారంభించారు. అదేవిధంగా పాత ముంబై జాతీయ రహదారి నుంచి ఎస్కీ, డీపీసీ మీదుగా రూ.19.51 కోట్ల వ్యయంతో నిర్మించిన లింక్ రోడ్డును, మియాపూర్, నిజాంపేటల మధ్య రూ.7.75 కోట్ల వ్యయంతో నిర్మించిన లింక్ రోడ్డును కేటీఆర్ ప్రారంభించారు. అలాగే లెదర్ పార్క్ వద్ద ఉన్న వీయూపీ బ్రిడ్జి సమీపంలో రూ.23.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న లింక్ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నగరంలో మొత్తం 137 లింక్ రోడ్లను నిర్మిస్తామని తెలిపారు. మొదటి దశలో 35 లింక్ రోడ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. మొత్తం రూ.313.65 కోట్ల వ్యయంతో ఈ రోడ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. మరో 100 లింక్ రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటని, నగరంలో అత్యుత్తమ జీవన ప్రమాణాలు ఉన్నాయని ఇప్పటికే పలు సంస్థలు వెల్లడించాయన్నారు.
హైదరాబాద్ ఆకర్షణీయమైన నగరంగా మారుతుందని, పట్టణీకరణ వేగంగా జరుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. మౌలిక వసతులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. తాగునీటి కోసం ప్రాజెక్టులను చేపట్టినట్లు వెల్లడించారు. నగరంలో లింక్ రోడ్ల వల్ల అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.45 నుంచి పాత ముంబై రోడ్డు వరకు నిర్మించిన లింక్ రోడ్డును 6 నెలల్లోనే పూర్తి చేశామన్నారు. నగరంలోని అనేక చెరువులను ఇప్పటికే అభివృద్ది చేశామని తెలిపారు. లింక్ రోడ్ల వల్ల ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుందని, వారి నుంచి సలహాలు, సూచనలు కూడా స్వీకరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.