మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఏఐసీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుడుం అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలను వ్యతిరేకిస్తూ అఖిల భారత కార్మిక సంఘాలు ఈ నెల 26న దేశవ్యాప్త సమ్మేకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆదివారం స్టాలిన్ నగర్ ఏఐసీటీయూ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న అనిల్‌కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో అదేవిధంగా బిజెపి పాలిత రాష్ట్రాల్లో కార్మికులు, రైతులు, సామాన్యులకు ఇబ్బందులు కలిగించేలా ప్రభుత్వాలు కొనసాగుతున్నాయన్నారు. లౌకిక వాద వ్యవస్థను చిన్నాబిన్నం చేయడానికి వేర్పాటు వాద సంస్థలను, వ్యక్తులను ఉపయోగించుకుంటున్నారని అన్నారు. బిజెపి అవలంభిస్తున్న కార్మిక, రైతు, జాతి వ్యతిరేక చర్యలను తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమయ్యిందని అన్నారు. ఈ క్రమంలో అఖిల భారత కార్మిక సంఘాలు ఈ నెల 26న పిలుపునిచ్చిన దేశవ్యాప్త సమ్మెలో ప్రతి ఒక్కరం పాల్గొని క్రేందం మెడలు వంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీటీయూ నాయకులు మైదంశెట్టి రమేష్, కన్నశ్రీనివాస్, పల్లె మురళి, పుష్ప, నర్సింహా, నర్సింగ్, రాజు, రాములు, కిషన్, లావణ్య, లక్ష్మి, సుల్తానా భేగం తదితరులు పాల్గొన్నారు.