- ప్రొబేషనరీ సబ్ ఇన్ స్పెక్టర్లకు సీపీ సూచన
- సీపీని కలిసిన నూతన ప్రొబేషనరీ ఎస్ఐలు
- ప్రజా రక్షణకు పని చేయాలి
- తెలంగాణ పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలి: సీపీ వీసీ సజ్జనార్
- ట్రైనీ ఎస్ఐ లకు వివిధ అంశాలపై అవగాహన
సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ పోలీస్ అకాడమీ లో ట్రైనింగ్ పూర్తి చేసిన 2019-2020 బ్యాచ్ కు చెందిన 90 మంది నూతన ప్రొబేషనరీ సబ్-ఇన్ స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ అనంతరం 6 రోజుల సెలవుల తర్వాత బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ లో భాగంగా 5 వారాల ట్రైనింగ్ నిమిత్తం శుక్రవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు వచ్చారు. వీరిని ప్రాక్టికల్ ట్రైనింగ్ నిమిత్తం సైబరాబాద్ లోని వివిధ పోలీస్ స్టేషన్ లకు అటాచ్ చేస్తారు. అనంతరం గ్రే హౌండ్స్ లో 3 నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది.
90 మంది సబ్ ఇన్ స్పెక్టర్లల్లో సివిల్ ఎస్ఐలు – 66 (పురుషులు 47, మహిళలు 19 మంది) ఉన్నారు. అలాగే ఆర్ఎస్‌ఐలు 24 మంది – (పురుషులు 21, మహిళలు 3 మంది) ఉన్నారు.
ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ప్రతి ఒక్కరిలో ఉండాలని కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఎస్ఐలకు సూచించారు. పోలీస్ శాఖపై ఎంతో నమ్మకంతో ప్రజలు వస్తారని వారి నమ్మకానికి తగ్గట్టుగా వారికి న్యాయం చేస్తూ మేమున్నామని భరోసా ఇవ్వాలని అన్నారు. నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పని చేయాలన్నారు. ప్రజలందరినీ సమానంగా చూడాలన్నారు. బంధుప్రీతి, పక్షపాతం చూపరాదన్నారు. పోలీసులు శారీరక ధృడత్వంతో పాటు మానసికంగా అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీస్ శాఖ క్రమశిక్షణ కలిగిన డిపార్ట్ మెంట్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో అలసత్వం వహించరాదన్నారు. వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఏదైనా తప్పు చేస్తే చట్టపర్యమైన చర్యలుంటాయన్నారు. ప్రజల మేలు కోసం నిబద్ధతతో పని చేసి తెలంగాణ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
పోలీసింగ్ లో సాంకేతిక వినియోగం, నేరాల అదుపు, బందోబస్తు చర్యలు, కేసుల దర్యాప్తు, కోర్టులో చార్జిషీటు దాఖలు చేసి నిందితులకు శిక్షలు పడేలా దర్యాప్తు చేయాలనే అంశాలతోపాటు విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు తదితర అంశాలపై సిపి ఎస్ఐలకు అవగాహన కల్పించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ టెక్నాలజీతో ప్రజలకు మరింత దగ్గరవ్వాలని పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సిపీ కొత్త ఎస్ఐలకు మార్గనిర్దేశం చేశారు.
ఆధునిక పోలిసింగ్ పై దృష్టి సారించాలన్నారు. ట్రైనీ ఎస్ఐలకు వివిధ విభాగాలను సీపీ వివరించారు. పెరుగుతున్న ఆన్ లైన్ మోసాల దృష్ట్యా ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన, లోన్ యాక్ట్స్ వంటి విషయాలపై జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు.
సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణీ ప్రియదర్శినీ మాట్లాడుతూ సిబ్బంది మేనేజ్‌మెంట్, టైమ్ మేనేజ్‌మెంట్ పై దృష్టి సారించాలన్నారు. నిరంతరం ప్రజలకు న్యాయం చేయాలన్నారు. కేసు తీరును, దర్యాప్తు పద్దతులను అర్థం చేసుకోవాలన్నారు. సీడీ ఫైల్స్, సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లను అధ్యయనం చేయాలన్నారు. నిరంతరం ప్రరాజలకు మేలు చేసేందుకు పని చేయాలన్నారు. అనంతరం సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ ఎమ్ విజయ్ కుమార్ ట్రాఫిక్ చట్టాలను వివరించారు. ముందు పోలీసులు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ ని పాటించి ప్రజలకు ఆదర్శంగా ఉండాలన్నారు. సైబరాబాద్ ఐటీ హబ్ గా ఉన్నందున టెక్నాలజీ వాడకంలో పోలీసులు ముందుండాలన్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగు పర్చుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్, సైబరాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏసీపీ లక్ష్మీ నారాయణ, ఆర్‌ఐలు పాల్గొన్నారు.